భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాడు. ఈ భేటీకి సూర్య తన కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సూర్యకుమార్ పిల్లలతో ఆప్యాయంగా గడిపారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని తన 'ఎక్స్' ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సూర్యకుమార్ పిల్లల పేర్లను ప్రస్తావిస్తూ, దీపావళి పండుగ వాతావరణంలో రామ్, సరయూల రాకతో పండుగ వాతావరణం మరింత పవిత్రంగా, దివ్యంగా మారిందని పేర్కొన్నారు.

ఈ భేటీలో ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన చారిత్రక విజయంలో భాగంగా గెలుచుకున్న బంగారు పతకంతో సూర్యకుమార్ కనిపించాడు. ప్రధాని మోదీ ఆ పతకాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించి, సూర్యకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ దృశ్యం టీమిండియా చారిత్రక విజయాన్ని గుర్తుచేసింది.

టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2022, 2023 సంవత్సరాల్లో వరుసగా 'ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు. 2022 అక్టోబర్‌లో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్న సూర్యకుమార్, 2023 జనవరిలో 910 పాయింట్లతో కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్‌ను సాధించాడు.

సూర్యకుమార్ నాయకత్వంలోనే భారత్ 2025 టీ20 ఆసియా కప్, 2026 టీ20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకుంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఇంతటి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే అత‌నిపై వేటు పడటం గమనార్హం. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న యూకే పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు. 

ఇటీవల కాలంలో సూర్య‌ బ్యాటింగ్ ఫామ్ కాస్త తగ్గడమే ఇందుకు కారణమని స‌మాచారం. అత‌ని స్థానంలో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్‌గా నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానితో సూర్యకుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.