టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లోపే ఈ ఘనత సాధించడం కష్టమేనని భారత జట్టు మాజీ సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కోహ్లీకి తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ వరకు ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే వంద సెంచరీల మార్కును అందుకోవడానికి సరిపడా మ్యాచ్‌లు లేవని జియోస్టార్‌తో చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 86 సెంచరీలు చేశాడు.

భారత మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారాతో కలిసి నాయర్‌ ఈ అంశంపై చర్చించాడు. ‘‘కోహ్లీ వంద సెంచరీలు చేయాలని నేనూ కోరుకుంటున్నా. కానీ ఆ స్థాయికి చేరుకోవాలంటే తగినన్ని మ్యాచ్‌లు ఆడాలి కదా! ప్రపంచకప్‌ తర్వాత కూడా అతడు ఆడొచ్చు. అయితే అప్పటికి అతడి స్ఫూర్తి ఇదే స్థాయిలో ఉంటుందా అన్నది చెప్పలేం. అందుకే ప్రపంచకప్‌లోపే ఈ ఘనత సాధించడం కష్టమని భావిస్తున్నా’’ అని నాయర్‌ వివరించాడు.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో 55 శతకాలు బాదాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును అధిగమించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తన 50వ వన్డే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇదే చర్చలో భారత జట్టు భవిష్యత్తు కూర్పుపైనా నాయర్‌ కీలక సూచనలు చేశాడు. హార్దిక్‌ పాండ్యాకు తోడుగా మరో ఆల్‌రౌండర్‌ను సిద్ధం చేయాలని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి పర్యటనల్లో ఇద్దరు సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు జట్టులో ఉంటే సమతూకం మెరుగవుతుందని చెప్పాడు. ఇద్దరు ప్రధాన పేసర్లతో పాటు బ్యాటింగ్‌ చేయగల ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని వివరించాడు.

మరోవైపు హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని పుజారా సూచించాడు. హార్దిక్‌ అందుబాటులో ఉంటే అతడే తొలి ఎంపిక అని, అయితే ఏడాది పొడవునా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండలేకపోతున్నందున సమాన సామర్థ్యాలున్న మరో ఆటగాడు అవసరమని పేర్కొన్నాడు.

వన్డే క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెంచేందుకు మళ్లీ ముక్కోణపు, నాలుగు దేశాల టోర్నీలను నిర్వహించాలని నాయర్‌, పుజారా అభిప్రాయపడ్డారు. మూడు, నాలుగు జట్లు పాల్గొనే టోర్నీల్లో ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారుతుందని, ఆటగాళ్లను ఎక్కువగా చూసే అవకాశం అభిమానులకు లభిస్తుందని పుజారా చెప్పాడు. ఇలాంటి పోటీలు పెద్ద టోర్నీలకు జట్లను సిద్ధం చేయడంతో పాటు వన్డే ఫార్మాట్‌పై ఆసక్తిని పెంచుతాయని నాయర్‌ పేర్కొన్నాడు. షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్‌ టెండూల్కర్‌ ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌ వంటి జ్ఞాపకాలు ఇలాంటి టోర్నీలతోనే ముడిపడి ఉన్నాయని గుర్తుచేశాడు.