న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ తన జీవితంలోని అత్యంత కఠినమైన దశ గురించి, క్రికెట్‌పై తన దృక్పథం ఎలా మారిపోయిందనే విషయంపై భావోద్వేగంగా స్పందించాడు. తన భార్య సారా, ఈ ఏడాది ఏప్రిల్‌లో లుకేమియా (ఒక రకమైన బ్ల‌డ్‌ క్యాన్సర్) బారిన పడిందని, ఎనిమిది నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకుందని వెల్లడించాడు. ఈ క్లిష్ట సమయంలో తాను పొందిన అనుభవం జీవితంపై, ఆటపై తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపాడు.

భారత్‌తో రెండో వన్డేకు ముందు వెల్లింగ్టన్‌లో మీడియాతో టిక్నర్ మాట్లాడుతూ.. "నా జీవితంలో చాలా ఒడిదొడుకులున్నాయి. ఈ కష్టకాలంలో నా భార్య సారా, నా కుటుంబం అండగా నిలవడం గొప్ప విషయం. ఇప్పుడు నేను మళ్లీ నా క్రికెట్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టాను. నా కెరీర్ ప్రారంభంలో చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ తర్వాత నా భార్య క్యాన్సర్ చికిత్స సమయంలో చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ దశను దాటి వచ్చాక, సరదాగా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని" అని వివరించాడు.

ఈ కష్టకాలం తనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని టిక్నర్ అన్నాడు. "క్రికెట్ నా కెరీర్‌లో ముఖ్యమైన భాగమే, కానీ అదే నా సర్వస్వం కాదు. జీవితం అంతకంటే చాలా పెద్దది. ఆట ముగిశాక నా కూతురు కోసం, నా భార్య కోసం ఇంటికి వెళ్లడం కంటే సంతోషం మరొకటి లేదు. అలా వెళ్లగలుగుతున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. అందుకే ఇప్పుడు క్రికెట్ ప్రాధాన్యం కాస్త తగ్గింది" అని పేర్కొన్నాడు.

ఇటీవల భారత్‌తో జరిగిన తొలి వన్డేలో టిక్నర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 4 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. దీనిపై సరదాగా స్పందిస్తూ.. "గతంలో ఇంగ్లండ్‌పై కూడా ఇక్కడ బాగానే బ్యాటింగ్ చేశాను. నన్ను బ్యాటింగ్ ఆర్డర్‌లో 10వ స్థానానికి ప్రమోట్ చేస్తే సంతోషిస్తాను. నెమ్మదిగా మూడో స్థానానికి చేరుకోవాలని అనుకుంటున్నాను" అని న‌వ్వుతూ అన్నాడు.

వన్డేల్లో బౌలర్లకు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయని, 400 పరుగుల భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లు తనకు ఇష్టం ఉండవని టిక్నర్ అభిప్రాయపడ్డాడు. వెల్లింగ్టన్ పిచ్‌పై బౌన్స్‌తో పాటు అదనపు సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్‌లోని ప్రతి మైదానం భిన్నంగా ఉంటుందని, డెత్ ఓవర్లలో అందుకు తగ్గ ప్రణాళికలతో బౌలింగ్ చేస్తామని వివరించాడు.