అమృత్‌సర్‌ నుంచి న్యూ జల్పాయ్‌గురి వెళుతున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని నాలుగు బోగీలకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించినట్లు సమాచారం లేదు.

రైలు నంబర్‌ 12508 కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ అమృత్‌సర్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పంజాబ్‌లోని సరాయ్‌ బంజారా రైల్వే స్టేషన్‌ సమీపంలో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి లెక్కిస్తే ఐదో బోగీలో తొలుత మంటలు కనిపించాయి. ఆ తర్వాత మరో మూడు బోగీలకూ వ్యాపించాయి.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల నుంచి మంటలు, దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.