ఒకప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఆడి, ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్‌గా మారిన వెంకటేష్ అయ్యర్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌ను వదిలేసి తనను రిటైన్ చేసుకోవడంతో కేకేఆర్ అభిమానుల నుంచి తీవ్రమైన ద్వేషాన్ని ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్‌లైన్‌లో తనపై జరిగిన దాడి గురించి, కేకేఆర్ నుంచి వైదొలగడం, ఆ తర్వాత ఆర్సీబీలో చేరడం వంటి అంశాలపై ఆకాష్ చోప్రాతో జరిగిన ‘బైట్ & బోల్’ పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పాడు.

గిల్‌ను కేకేఆర్ వదులుకున్న తర్వాత, గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, కేకేఆర్ యాజమాన్యం తనపై నమ్మకం ఉంచడంతో అభిమానులు తీవ్రంగా స్పందించారని వెంకటేష్ గుర్తుచేసుకున్నాడు. "చాలా కాలంగా నేను ద్వేషానికి గురవుతూనే ఉన్నాను. ఇప్పటికీ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేస్తే చాలు, కేకేఆర్ సోషల్ మీడియా పేజీల్లో ‘బంగారం కోసం వజ్రాన్ని వదులుకున్నాం’ అంటూ కామెంట్లు పెడతారు" అని ఆయన వాపోయాడు.

ఐపీఎల్ 2026 వేలానికి ముందు జరిగిన పరిణామాలను కూడా పంచుకున్నాడు. కేకేఆర్ తనను రిలీజ్ చేసినప్పుడు, నిర్ణయాన్ని మార్చుకునే అవకాశంపై తాను నేరుగా సహ యజమాని షారుఖ్ ఖాన్‌ను అడిగినట్లు అయ్యర్ తెలిపాడు. "ఆ సమయంలో నా కళ్లు చెమర్చాయి. నేను షారుఖ్ సర్‌ను కూడా అడిగాను" అని భావోద్వేగంగా చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో తనను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ తిరిగి కొనుగోలు చేసినప్పటికీ, 2026 వేలంలో తనను వదులుకోవడంతో "ఇక నా జెర్సీ పర్పుల్ రంగులో ఉండదని ముందే సిద్ధమయ్యాను" అని అయ్యర్ అన్నాడు.

అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీలో చేరిన తర్వాత తన అనుభవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వెంకటేష్ అయ్యర్ పేర్కొన్నాడు. "మీరు నమ్మరు, మ్యాచ్‌లకు ముందు ఆర్సీబీ జెర్సీకి అభిమానులు పూజలు చేయడం నేను కళ్లారా చూశాను. ఇది చాలా ప్రత్యేకం. అభిమానం వేరే స్థాయిలో ఉంది" అని వివరించాడు. 

2026 సీజన్‌లో ఆరంభంలో బెంచ్‌కే పరిమితమైనా, ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా అరంగేట్రం చేసి అదరగొట్టాడు. ఒక మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లో 29 పరుగులు, పంజాబ్ కింగ్స్‌పై 40 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 52.25 సగటుతో 209 పరుగులు సాధించి, ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో తన వంతు సహకారం అందించాడు.