పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్, తమ దేశ క్రికెట్ అభిమానుల ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో తనకు ఎదురైన దారుణమైన బెదిరింపుల గురించి బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా స్టార్ ఆటగాడు బాబర్ ఆజం అభిమానుల నుంచి తనకు ప్రాణహాని స్థాయిలో సందేశాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవల ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అజామ్ ఖాన్, ఐర్లాండ్‌తో జరిగిన ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. "ఆ మ్యాచ్‌లో నేను, బాబర్ ఆజం బ్యాటింగ్ చేస్తున్నాం. అతను అప్పటికే 75 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. జట్టు గెలవడానికి 40 పరుగులు అవసరం. ఆ సమయంలో నా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో కింద ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. 'ఒకవేళ నువ్వు బాబర్ సెంచరీని అడ్డుకుంటే, మీ అమ్మ చనిపోతుంది, మీ నాన్నకు క్యాన్సర్ వస్తుంది' అని అందులో రాశాడు. ఇలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏంటి?" అని అజామ్ ఖాన్ ఆవేదన చెందాడు. "మా క్రికెటర్లకు చదువుకోని అభిమానులు ఉన్నారు. బాబర్ తో, బాబర్ ఆటతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతని ఫ్యాన్‌బేస్ చాలా విషపూరితమైనది" అని ఘాటుగా విమర్శించాడు.

ఇదే సమయంలో, 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వైఫల్యానికి తన ఫిట్‌నెస్‌ను కారణంగా చూపుతూ విమర్శించడం పట్ల కూడా అజామ్ ఖాన్ మండిపడ్డాడు. "2024 ప్రపంచకప్‌లో జరిగిన ప్రతిదానికీ నన్నే నిందించారు. నేను ఆడింది ఒక్క మ్యాచే, ఎదుర్కొన్నది ఒక్క బంతే. మొత్తం ప్రపంచకప్ వైఫల్యానికి నన్నెలా బాధ్యుడిని చేస్తారు? జట్టులోని అత్యంత ఫిట్ ప్లేయర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. కనీసం 120 పరుగులు కూడా ఛేదించలేకపోయారు. అలాంటిది మీరు ఫిట్‌నెస్ గురించి ఎలా మాట్లాడతారు?" అని ప్రశ్నించాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్, భారత్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. అంతకుముందు అమెరికాతోనూ ఓడిపోయింది. ఆ టోర్నీ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ ప్రపంచకప్ తర్వాత అజామ్ ఖాన్ మళ్లీ పాకిస్థాన్ జట్టుకు ఆడలేదు. ప్రస్తుతం అతను కెనడాలో జరుగుతున్న జీటీ20 లీగ్‌లో ఆడుతున్నప్పటికీ, జాతీయ జట్టులోకి అతని పునరాగమనం ఇప్పట్లో కష్టమేనని తెలుస్తోంది.