ముంబై మహానగరంలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' సహా నగరంలోని పలు కీలక ప్రాంతాలను పేల్చివేస్తామంటూ ఆగంతుకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. ఈ మెయిల్ నేరుగా బాంబే హైకోర్టుకు రావడంతో భద్రతా ఏజెన్సీలు తక్షణమే అప్రమత్తమయ్యాయి.

న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం... బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), వర్లీ రేస్‌కోర్స్, అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చివేస్తామని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. "ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముంబై పోలీసులు, ఇతర భద్రతా ఏజెన్సీలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం" అని ముంబై పోలీసులు తెలిపినట్టు ఐఏఎన్ఎస్ వెల్లడించింది. 

బెదిరింపు నేపథ్యంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్థానిక పోలీసులు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో ముంబైలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. అక్టోబర్ 23న అమితాబ్ బచ్చన్ ఆస్తిని లక్ష్యంగా చేసుకుని ఓ స్కూల్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అంతకుముందు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయానికి కూడా ఇలాంటి హెచ్చరికే అందింది. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

తాజా ఘటనతో సైబర్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ-మెయిల్ పంపిన వారి ఐపీ అడ్రస్, డిజిటల్ ఆధారాలను ట్రేస్ చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.