అమెరికాలో ఒక సంచలనాత్మకమైన కేసు నమోదైంది. తన భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని, ఈ కుట్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ సాయం తీసుకుందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ సంస్థపై దావా వేశాడు. ఈ కేసులో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.

'బ్లూమ్‌బర్గ్' నివేదిక ప్రకారం.. నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్, తన భార్య చెరిల్ గేట్స్‌తో విడాకుల చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనను విషం పెట్టి చంపేందుకు చెరిల్ ప్రయత్నించిందని, దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను చాట్‌జీపీటీ సహాయంతో రూపొందించిందని జేమ్స్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

చేతిరాత నోట్‌తో బయటపడిన కుట్ర
2025 సెప్టెంబర్‌లో, తీవ్ర అనారోగ్యానికి గురైన కొన్ని నెలల తర్వాత, జేమ్స్ తన భార్యకు చెందిన చేతిరాత నోట్‌ను కనుగొన్నారు. ఆ నోట్‌లో కొన్ని రకాల విషపదార్థాల పేర్లు, వాటిని ఎంత మోతాదులో ఇవ్వాలో రాసి ఉంది. ఆ నోట్ పైభాగంలో "చాట్‌జీపీటీ సంభాషణలన్నీ తొలగించు", "లాగ్ అవుట్ చేయి" వంటి సూచనలు ఉండటంతో జేమ్స్‌కు అనుమానం బలపడింది. అంతకుముందు జేమ్స్ గుండె సంబంధిత లక్షణాలు, తీవ్రమైన కడుపునొప్పి, బలహీనత, స్పృహ తప్పేంత గందరగోళంతో బాధపడినట్లు తెలిపారు. ఈ ఆధారాలతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

భార్యపై కేసు కొట్టివేత
జేమ్స్ ఫిర్యాదు మేరకు చెరిల్ గేట్స్‌పై హత్యాప్రయత్నం, ఆహారంలో విషం కలపడం వంటి అభియోగాలతో 2025లో కేసు నమోదైంది. అయితే, తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాసిక్యూటర్లు ఆమెపై కేసును కొట్టివేశారు. దీంతో జేమ్స్ గేట్స్ నేరుగా ఓపెన్ఏఐ సంస్థపైనే దావా వేశారు.

చాట్‌జీపీటీ ఎలా సాయం చేసిందంటే..
దావా ప్రకారం చెరిల్ తన వృత్తిపరమైన పనులకు, ఇంటి పనులకు సంబంధించిన ప్రశ్నలకు మొదట్లో చాట్‌జీపీటీని వాడేవారు. క్రమంగా తమ మధ్య ఉన్న విభేదాల గురించి చాట్‌బాట్‌తో చెప్పుకోవడం మొదలుపెట్టారు. "తన భర్త తనపై నిఘా పెట్టాడని, తమను వదిలేసి వెళ్లిపోతాడనే భ్రమలను, అపనమ్మకాన్ని చాట్‌జీపీటీ మరింత పెంచి, ఒక ఎకో ఛాంబర్‌లా పనిచేసింది" అని దావాలో పేర్కొన్నారు.

అనంతరం ఒలియాండర్ మొక్క విషపూరితమా? అని ఆమె చాట్‌జీపీటీని అడిగినట్లు తెలుస్తోంది. తన భర్త ఆ ఆకులను తనకు తెలియకుండా తినిపించవచ్చని, ఆత్మరక్షణ కోసం సమాచారం అడుగుతున్నట్లు ఆమె చాట్‌బాట్‌ను నమ్మించింది. ఎంత మోతాదు ప్రాణాంతకం, దానిని ఎలా దాచాలి వంటి వివరాలను చాట్‌జీపీటీ ఆమెకు అందించినట్లు దావాలో పొందుపరిచిన స్క్రీన్‌షాట్లు చూపిస్తున్నాయి. ఒక దశలో.. "శవపరీక్షలో ఒలియాండర్ ఆనవాళ్లు బయటపడతాయా?" అని ఆమె అడగ్గా, "ఇది చాలా కీలకమైన ప్రశ్న - మీరు సరైన కారణంతోనే అడుగుతున్నారు" అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చినట్లు స్క్రీన్‌షాట్‌లో ఉంది.

ఓపెన్ఏఐ స్పందన
ఈ కేసుపై స్పందించిన ఓపెన్ఏఐ, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు తాము సమాచారం అందించామని, ఆ యూజర్‌ను (చెరిల్ గేట్స్‌ను) తమ ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించామని ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో ఇలాంటి కేసుల్లో, చాట్‌బాట్‌లు సృష్టించే కంటెంట్ వాక్ స్వాతంత్ర్యం కిందకు వస్తుందని, వినియోగదారులు చేసే నేరాలకు తమకు ప్రత్యక్ష బాధ్యత లేదని ఏఐ కంపెనీలు వాదించాయి.