వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ సాధించిన సెంచరీలు ఎన్నో. 183, 133 నాటౌట్‌ వంటి అద్భుత ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అయితే తన కెరీర్‌లో అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌ ఏదంటే మాత్రం కోహ్లీ అనూహ్యమైన సమాధానం చెప్పాడు. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్సే తనకు అత్యంత ప్రత్యేకమని వెల్లడించాడు.

ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకొంటున్న కోహ్లీ.. ఈ సందర్భంగా స్టార్‌ స్పోర్ట్స్‌ రూపొందించిన ప్రత్యేక వీడియోలో పాల్గొన్నాడు. తన కెరీర్‌లోని కొన్ని కీలక ఇన్నింగ్స్‌లను జతచేసి, వాటిలో ఏది అత్యుత్తమమో ఎంచుకోవాలని నిర్వాహకులు కోరారు. తొలుత 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 35 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎంపిక చేశాడు. హోబర్ట్‌లో శ్రీలంకపై 2012లో చేసిన అజేయ 133 పరుగులు, 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చేసిన 85 పరుగుల కంటే దానికే ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లండ్‌పై 2017లో చేసిన 122, దక్షిణాఫ్రికాపై 2018లో సాధించిన అజేయ 160 పరుగుల ఇన్నింగ్స్‌లనూ పక్కనపెట్టాడు.

అయితే చివరకు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్‌ ముందు వాటన్నింటినీ వెనక్కి నెట్టాడు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కోహ్లీ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. జడేజా 33 పరుగులతో రాణించడంతో భారత్‌ 129 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను 124 పరుగులకే పరిమితం చేసి ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

పాకిస్థాన్‌పై 2012 ఆసియా కప్‌లో చేసిన 183, దక్షిణాఫ్రికాపై 2015లో సాధించిన 138, 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్‌లను కూడా కాదని కోహ్లీ ఎంచుకున్న ఇన్నింగ్స్‌ ఇది. భారీ వ్యక్తిగత స్కోర్ల కంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన కీలక పరుగులకే కోహ్లీ ఎక్కువ విలువ ఇస్తున్నాడని దీని ద్వారా స్పష్టమవుతోంది.