భారత క్రికెట్ ఐకాన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న అత‌ని కెరీర్, కేవలం గణాంకాలకే పరిమితం కాని ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన యువ కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టి, 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి ఎదిగిన కోహ్లీ ప్రస్థానం అసామాన్యం. ఎన్నో రికార్డులు, ట్రోఫీలు, మైలురాళ్లు, అలాగే గుండెకోతకు గురిచేసిన ఓటములు, వైఫల్యాలు, విమర్శలు.. వీటన్నిటినీ చూస్తూ ఒకే సమయంలో 'సూపర్ హ్యూమన్'గా, 'హ్యూమన్'గా ఎలా ఉండవచ్చో ప్రపంచానికి చూపించాడు.

కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్, తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ 100 సెంచరీల మార్క్, ముచ్చ‌ట‌గా మూడోసారి ఐపీఎల్ టైటిల్ వంటి లక్ష్యాలపై దృష్టి సారించిన కోహ్లీ.. పరుగుల దాహం తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ సందర్భంగా అత‌ని కెరీర్‌లోని కొన్ని అద్భుతమైన రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.

టెస్టు క్రికెట్‌లో తిరుగులేని కెప్టెన్
టెస్టు క్రికెట్‌లో కోహ్లీది ఒక ప్రత్యేక అధ్యాయం. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు (40) సాధించిన ఘనత తనదే. కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌లలోనూ భారత్ విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా 'సేనా' (SENA - దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 12 సెంచరీలు సాధించి సచిన్ (17) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై 7 టెస్టు సెంచరీలు చేసి, ఏ ఇతర ఆసియా బ్యాటర్ కూడా సాధించని ఘనతను అందుకున్నాడు.

వన్డేల్లో 'ఛేజ్ మాస్టర్'
వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీని 'ఛేజ్ మాస్టర్' అని ఎందుకు అంటారో గణాంకాలే చెబుతాయి. వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధికంగా 8,741 పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అందులోనూ విజయవంతమైన ఛేజింగ్‌లలో అతని సగటు 89.95 కావడం అతని మానసిక స్థైర్యానికి నిదర్శనం. వన్డేల్లో కోహ్లీ సాధించిన 55 సెంచరీలలో 45 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్‌లలోనే రావడం విశేషం. స్వదేశంలో 7,035 పరుగులు చేసి, ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అప్రతిహత ప్రస్థానం
అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 28,601 పరుగులు సాధించాడు. 2010-19 మధ్య దశాబ్ద కాలంలో 20,960 పరుగులు చేసి, ఒక దశాబ్దంలో 20,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐసీసీ టోర్నమెంట్లలోనూ కోహ్లీ హవా కొనసాగింది. ఐసీసీ వైట్-బాల్ టోర్నీలలో అత్యధిక పరుగులు (3,834), అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు (33) అతని పేరు మీదే ఉన్నాయి. 

2014, 2016 టీ20 ప్రపంచకప్‌లు, 2023 వన్డే ప్రపంచకప్‌లలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులు గెలిచి, ఈ ఘనతను మూడుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-20 ఆటగాళ్లలో 50కి పైగా సగటు ఉన్న ఏకైక ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే.

38 ఏళ్ల వయసులోనూ అదే పట్టుదల, అదే కసితో ఆడుతున్న కోహ్లీ నుంచి మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు, రికార్డులు చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.