ఐపీఎల్‌లో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కీలక సూచన చేశారు. ఇంత చిన్న వయసులోనే నాయకత్వ బాధ్యతలు అప్పగించడం తొందరపాటేనని అభిప్రాయపడ్డారు. ముందుగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడి అనుభవం సంపాదించాలని సూచించారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ ఎదగాలని హితవు పలికారు.

రెడ్డిట్‌లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ అభిమాని వైభవ్‌కు 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సచిన్‌ అభిప్రాయం అడిగారు. దీనికి స్పందించిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. దులీప్‌ ట్రోఫీలో వైస్‌ కెప్టెన్‌గా నియమించడం కూడా తొందరపాటేనని అన్నారు. మరిన్ని రెడ్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగేలా చూడాలని పేర్కొన్నారు.

2026 దులీప్‌ ట్రోఫీలో ఇషాన్‌ కిషన్‌ నేతృత్వంలోని ఈస్ట్‌ జోన్‌ జట్టుకు వైభవ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అప్పటికి అతడు బిహార్‌ తరఫున కొన్ని ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయినా మహమ్మద్‌ షమీ, అభిమన్యు ఈశ్వరన్‌, ముఖేశ్‌ కుమార్‌ వంటి అనుభవజ్ఞుల కంటే ముందే నాయకత్వ బాధ్యతలు దక్కడం చర్చనీయాంశమైంది. సెమీఫైనల్‌లో ఇషాన్‌ కిషన్‌ వేలికి గాయమవడంతో వైభవ్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆ టోర్నీలో ఈస్ట్‌ జోన్‌ విజేతగా నిలిచింది.

ఇదే కార్యక్రమంలో తన క్రికెట్‌ ప్రయాణంలో అన్న అజిత్‌ టెండూల్కర్‌ పాత్రను సచిన్‌ గుర్తుచేసుకున్నారు. తాను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మ్యాచ్‌ ఒత్తిడిని తట్టుకోలేక అజిత్‌ కొన్నిసార్లు ఫోన్‌ అప్‌డేట్స్‌కు దూరంగా ఉండేందుకు కారులో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారని చెప్పారు. అలాగే పాన్‌ మసాలా, జూదానికి సంబంధించిన ప్రకటనల్లో ఎందుకు నటించరని అడగ్గా.. తండ్రి రమేశ్‌కు ఇచ్చిన మాటే కారణమని బదులిచ్చారు.