బాలీవుడ్‌ స్టార్‌ జంట అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ చాలా రోజుల తర్వాత కలిసి పబ్లిక్‌గా కనిపించారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకకు జంటగా హాజరయ్యారు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ కెమెరాలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ వేడుకలో అభిషేక్‌ నల్లటి కుర్తాలో కనిపించగా.. ఐశ్వర్య ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో ఐశ్వర్య ప్రేమగా అభిషేక్‌ వైపు చూసింది. ఆ తర్వాత ఆయన ఛాతీపై తల వాల్చింది. అభిషేక్‌ కూడా ఆమె చేతిని పట్టుకుని కనిపించాడు.

గత కొంతకాలంగా ఈ జంట వైవాహిక జీవితంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే గతంలోనే అభిషేక్‌ ఈ వార్తలను ఖండించాడు. అవాస్తవమైన ప్రచారంగా కొట్టిపారేశాడు. తాజాగా ఇద్దరూ కలిసి కనిపించడంతో మరోసారి వీరి అనుబంధంపై చర్చ మొదలైంది. ఈ వేడుకకు కుమార్తె ఆరాధ్య మాత్రం హాజరుకాలేదు.

అభిషేక్‌, ఐశ్వర్య పరిచయం 1999లో ‘ఢాయ్‌ అక్షర్‌ ప్రేమ్‌ కే’ సినిమా ఫొటోషూట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘కుచ్‌ నా కహో’, ‘ఉమ్రావ్‌ జాన్‌’, ‘ధూమ్‌ 2’ చిత్రాల్లో కలిసి నటించారు. ‘ఉమ్రావ్‌ జాన్‌’, ‘ధూమ్‌ 2’ సినిమాల సమయంలో వారి స్నేహం ప్రేమగా మారింది. 2007లో ‘గురు’ సినిమా ప్రమోషన్ల కోసం న్యూయార్క్‌ వెళ్లిన సమయంలో వాళ్లు మరింత దగ్గరయ్యారు. అదే ఏడాది ఏప్రిల్‌ 20న ముంబయిలో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి ఆరాధ్య జన్మించింది.