ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చుట్టూ ఐపీఎల్‌ 2027కు ముందే చర్చ మొదలైంది. అతడు జట్టును వీడనున్నాడంటూ ట్రేడ్‌ వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబయి జట్టులో హార్దిక్‌ ఒంటరిగా మిగిలిపోయిన భావనకు గురై ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అతడు మళ్లీ ముంబయి తరఫున ఆడాలనుకుంటే కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుని ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు.

క్రిక్‌బజ్‌ చర్చలో పాల్గొన్న రాయుడు.. ముంబయిలో హార్దిక్‌ పరిస్థితి అంత బాలేదని వ్యాఖ్యానించాడు. ఒక ఆటగాడు జట్టులో తనను తాను ఇరుక్కుపోయినట్లు భావిస్తే, ప్రతి విషయంలోనూ వెనక్కి చూసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అలాంటి పరిస్థితులు ఆటగాడి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాడు. హార్దిక్‌ విషయంలో జరిగిన ప్రతిదానికీ అతడినే తప్పుబట్టలేమని, ఇతర కారణాలు కూడా ఉండొచ్చని పేర్కొన్నాడు. 

2024 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబయి ఇండియన్స్‌కు తిరిగొచ్చిన హార్దిక్‌కు ఫ్రాంచైజీ కెప్టెన్సీ అప్పగించింది. అప్పటివరకు జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు ఇవ్వడంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానంలోనూ జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. హార్దిక్‌ నాయకత్వంలో మూడు సీజన్లలో ముంబయి ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరినట్లు రాయుడు ప్రస్తావించాడు.

హార్దిక్‌ ముంబయిలోనే కొనసాగాలనుకుంటే కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా ఆడాలని రాయుడు సూచించాడు. తన సహజమైన ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు మ్యాచ్‌ విన్నర్‌గా మారడంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. ఒకవేళ ముంబయిని వీడితే కనీసం ఒక సీజన్‌ పాటు మరో జట్టులోనూ కెప్టెన్సీ చేపట్టకూడదని అభిప్రాయపడ్డాడు.

ట్రేడ్‌ ద్వారా హార్దిక్‌ వెళ్లే అవకాశాలపైనా రాయుడు స్పందించాడు. పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లలో అతడికి మంచి వాతావరణం ఉండొచ్చని పేర్కొన్నాడు. అక్కడ కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా తన ఆటపై దృష్టి పెట్టవచ్చని చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం ప్రస్తుతం కెప్టెన్‌ అవసరంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొంటున్నందున హార్దిక్‌కు అంత సులభమైన ఎంపిక కాదని విశ్లేషించాడు. 

హార్దిక్‌ పాండ్యా ముంబయి నుంచి పంజాబ్‌ కింగ్స్‌కు మారే అవకాశాలపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అర్ష్‌దీప్‌ సింగ్‌తో ఆటగాళ్ల మార్పిడి ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ట్రేడ్‌పై ఆయా ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.