పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చని నిరూపించారు క్యాష్‌కరో, ఎర్న్‌కరో సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ. ఒకవైపు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతూనే, మరోవైపు తన వ్యాపారం కోసం వందల కోట్ల నిధులను సమీకరించిన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ఆమె పంచుకున్నారు. కిడ్నీ కేవలం 3-4 శాతం మాత్రమే పనిచేస్తున్న సమయంలోనే తన కంపెనీ కోసం రూ.130 కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు.

నాలుగేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఈ క్లిష్టమైన దశను వివరిస్తూ స్వాతి ఇటీవల ఓ వీడియోను విడుదల చేశారు. ఆ సమయంలో తన కంపెనీకి సిరీస్-సి ఫండింగ్ కోసం ప్రయత్నిస్తున్నానని, అదే సమయంలో తన కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. "ఒకవైపు నా వ్యాపారం కోసం రూ.130 కోట్లు సమీకరిస్తున్నాను. మరోవైపు నా కిడ్నీ 3-4 శాతమే పనిచేస్తోంది. హిమోగ్లోబిన్ 5.5కు పడిపోయింది. అయినా నేను వెనక్కి తగ్గకుండా రోజూ మామూలుగానే పనిచేశాను" అని స్వాతి వివరించారు. ఆ తర్వాత ఆమె కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.

హరియాణాలోని అంబాలా అనే చిన్న పట్టణంలో పుట్టిన తనకు ఎప్పుడూ పెద్ద కలలు ఉండేవని స్వాతి చెప్పారు. స్కాలర్‌షిప్‌లతో సింగపూర్‌లో చదువుకుని, ఆ తర్వాత మరో స్కాలర్‌షిప్‌పై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. చదువు పూర్తయ్యాక గోల్డ్‌మన్ శాక్స్‌లో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసి, ఆ తర్వాత తన భర్త రోహన్‌తో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత యూకేలో వ్యాపారం ప్రారంభించి, అనంతరం భారత్‌లో క్యాష్‌కరో, ఎర్న్‌కరోలను విజయవంతంగా నిర్మించారు.

ఈ ప్రయాణంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా వంటి వారి నుంచి పెట్టుబడులు సాధించడం సవాలుగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకు తమ కంపెనీ రూ.250 కోట్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించారు. తన 20 ఏళ్ల ప్రయాణంలోని అనుభవాలు, పొరపాట్లు, పాఠాలు ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను పంచుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్వాతి స్ఫూర్తిదాయక ప్రయాణంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.