దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందించిన ఆటగాడి ఇంట్లో దొంగలు పడ్డారు. కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమైన పతకాన్ని కూడా వదల్లేదు. భారత హాకీ దిగ్గజం ఎం.ఎం. సోమయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు.. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఆయన గెలుచుకున్న స్వర్ణ పతకంతో పాటు మరో మూడు అంతర్జాతీయ పతకాలను ఎత్తుకెళ్లారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సోమయ్య (67) తన కుటుంబ సభ్యులతో కలిసి అక్టోబర్‌ 25న కొడగుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు అక్టోబర్‌ 28 తెల్లవారుజామున 2.34 గంటలకు బెంగళూరులోని న్యూ తిప్పసంద్ర, హెచ్‌ఏఎల్‌ మూడో స్టేజ్‌లో ఉన్న ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం 7.15 గంటల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగింటి వ్యక్తి సోమయ్యకు సమాచారం ఇచ్చారు.

పొరుగింట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వారిలో ఒకరు నీలం రంగు చొక్కా, మరొకరు ఎరుపు రంగు చొక్కా ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దొంగలు 1980 మాస్కో ఒలింపిక్స్‌ స్వర్ణ పతకంతో పాటు 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకం, 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో గెలుచుకున్న కాంస్య పతకం, 1982 ఆమ్‌స్టర్‌డామ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో సాధించిన మరో కాంస్య పతకాన్ని ఎత్తుకెళ్లారు. వీటితో పాటు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.30 వేల నగదు చోరీ చేశారు. మొత్తం చోరీ సొత్తు విలువ రూ.3.53 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

సోమయ్య ఫిర్యాదుతో ఇందిరానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా.. సోమయ్య 1980, 1984, 1988 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1985లో అర్జున అవార్డు అందుకున్నారు.