ప్రముఖ నటి సాయి పల్లవి త్వరలో రానున్న ‘రామాయణం’ చిత్రంలో సీతాదేవి పాత్రలో కనిపించనున్న విషయం విదితమే. ఈ ప్రతిష్ఠాత్మక పాత్ర కోసం తాను ఎలా సిద్ధమైందీ ఆమె తాజాగా వెల్లడించింది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ పాత్ర పోషణలో ప్రార్థన, ధ్యానం కీలక పాత్ర పోషించాయని పేర్కొంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ పాత్ర కోసం నేను ప్రధానంగా ప్రార్థనలు చేశాను. ఎందుకంటే మేము తెరకెక్కిస్తున్నది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది చరిత్రగా నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలు కూడా దీనిని వీక్షిస్తాయి. అందుకే ఆ పాత్రకు తగిన గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ప్రార్థనలకే ప్రాధాన్యమిచ్చాను” అని వివరించింది.

షూటింగ్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం ఎంతో తోడ్పడిందని సాయి పల్లవి తెలిపింది. “ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురైనప్పుడు.. ‘ఇలాంటి సమయంలో సీతమ్మ ఎలా స్పందించేవారు?’ అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆవేశపడకుండా ప్రశాంతంగా పరిస్థితులను గమనించడం సీతమ్మ పాత్ర నుంచే నేర్చుకున్నాను” అని ఆమె పేర్కొంది.

నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తున్నారు.