భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 26వ అంతర్జాతీయ భారత ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ చిత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 12 అవార్డులను కైవసం చేసుకుని ఈ ఏడాది ఐఫాలో అతిపెద్ద విజేతగా నిలిచింది. ఈ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.

‘ధురంధర్’ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడిగా ఆదిత్య ధర్‌కు అవార్డు లభించింది. అంతేగాక ఉత్తమ ఒరిజినల్ కథ, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణల విభాగాల్లోనూ ఆదిత్య ధర్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇదే చిత్రంలో నటనకు గాను సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా, అక్షయ్ ఖన్నా ఉత్తమ ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా శశ్వత్ సచ్‌దేవ్‌కు కూడా ‘ధురంధర్’ చిత్రానికే అవార్డు దక్కింది.

మరోవైపు ‘సైయారా’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అనీత్ పడ్డా ఉత్తమ నటి (ప్రధాన పాత్ర) అవార్డును సొంతం చేసుకున్నారు. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ చిత్రంలో నటనకు హ్యూమా ఖురేషి ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. సంగీత విభాగంలో ‘సైయారా’ చిత్రం పలు అవార్డులు గెలుచుకుంది. 

ఈ చిత్రంలోని పాటకు ఇర్షాద్ కమిల్ ఉత్తమ గేయ రచయితగా, ఫహీమ్ అబ్దుల్లా ఉత్తమ నేపథ్య గాయకుడిగా, శ్రేయా ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులు అందుకున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవతార్: ఫైర్ & యాష్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది.

డిజిటల్ విభాగంలోనూ ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఉత్తమ వెబ్ సిరీస్‌గా, ఉత్తమ దర్శకత్వ సిరీస్‌గా రెండు అవార్డులను గెలుచుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పాతాళ్ లోక్ సీజన్ 2’ సిరీస్‌లో నటనకు గాను జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటుడిగా, తిలోత్తమ షోమ్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు.