యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనుషుల ప్రవర్తనలోని ద్వంద్వ ప్రమాణాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"ఒకప్పుడు మిమ్మల్ని తప్పు చేసినట్టు భావించేలా చేసిన పనులే, పాత్రలు తారుమారైనప్పుడు సర్వసాధారణంగా మారడం విచిత్రంగా ఉంటుంది" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుపమ పేర్కొన్నారు. సంతోషంగా ఉండటం, ఇష్టమైన వారిని మెచ్చుకోవడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా తప్పుగా చిత్రీకరించారని, పదేపదే వివరణలు ఇచ్చుకునేలా చేసి, క్షమాపణలు చెప్పే స్థితికి నెట్టారని ఆమె వాపోయారు.

అయితే, అవే పనులను ఇప్పుడు ఇతరులు ఎలాంటి మొహమాటం లేకుండా బహిరంగంగా చేస్తున్నారని, దీన్నిబట్టి "సమస్య మనం ఏం చేశామన్నది కాదు, అది ఎవరు చేశారన్నదే ముఖ్యం" అని తనకు అర్థమైందని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా తన ఫాలోవర్స్‌కు కూడా అనుపమ ఒక విజ్ఞప్తి చేశారు. ఎవరి కామెంట్‌కు రిప్లై ఇచ్చానో పోల్చి చూస్తూ తనకు ట్యాగ్‌లు, మెసేజ్‌లు పెట్టవద్దని కోరారు. "నాకు సోషల్ మీడియాకు అతీతంగా సొంత బాధ్యతలు, పోరాటాలు ఉన్నాయి. ఒత్తిడి కోసం ఆన్‌లైన్‌లో నటిస్తూ బతకలేను" అని ఆమె స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక ప్రేమ వ్యవహారం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయానని చెప్పిన అనుపమ, ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడంతో ఇది ఎవరిని ఉద్దేశించిందనే చర్చ జరుగుతోంది.