ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య ఘటన నటుడు ప్రకాశ్‌రాజ్‌ను తీవ్రంగా కలచివేసిందని ఆయన భార్య, కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ తెలిపింది. ఆ ఘటన తర్వాతే ‘భయపడుతూ ఎన్నాళ్లు బతకాలి?’ అని ప్రకాశ్‌రాజ్‌ ఆలోచించాడని, అప్పటి నుంచే రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా స్పందించడం మొదలుపెట్టాడని వెల్లడించింది. అయితే, అతడి రాజకీయ అభిప్రాయాలు సినీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని ఆమె పేర్కొంది.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోనీ వర్మ ఈ విషయాలను పంచుకుంది. మొదట్లో ప్రకాశ్‌రాజ్‌ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడటం తనను భయపెట్టేదని తెలిపింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందేదాన్నని చెప్పింది.

ప్రకాశ్‌రాజ్‌ తన అభిప్రాయాలను ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో వ్యక్తం చేస్తుంటారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ తన వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తుంటారు. అయితే, ఈ కారణంగా అతడికి సినిమా అవకాశాలు తగ్గాయని పోనీ వర్మ తెలిపింది. కొన్ని సందర్భాల్లో సినిమాల కోసం అడ్వాన్స్‌ ఇచ్చిన తర్వాత కూడా అతడిని ప్రాజెక్టుల నుంచి తప్పించిన సందర్భాలున్నాయని వెల్లడించింది.

రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడం వల్ల ప్రకాశ్‌రాజ్‌ వృత్తిపరంగా ఎంతో నష్టపోయాడని ఆమె తెలిపింది. అయినప్పటికీ, తన మనస్సాక్షికి తప్పుగా అనిపించిన పనిని అంగీకరించకూడదనే నిర్ణయానికి అతడు కట్టుబడి ఉన్నాడని పేర్కొంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందుల కంటే తన నమ్మకాలు, విలువలకే ప్రకాశ్‌రాజ్‌ ప్రాధాన్యం ఇస్తారని పోనీ వర్మ వ్యాఖ్యానించింది.