బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్, దోపిడీ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షిగా హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 2న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన మూడో అనుబంధ ఛార్జిషీట్‌లో నోరా ఫతేహీని ప్రాసిక్యూషన్ విట్నెస్ (LW-3)గా చేర్చారు.

సీనియర్ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడిన సుకేశ్ చంద్రశేఖర్... 2020-21 మధ్య ఢిల్లీలోని రోహిణి జైలు నుంచే ఓ పెద్ద దోపిడీ రాకెట్‌ను నడిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను టార్గెట్ చేసి, జైలులో ఉన్న ఆమె భర్తను విడిపిస్తానని నమ్మించి ఆమె నుంచి దాదాపు రూ. 200 కోట్లు వసూలు చేశాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారణ జరిపి... మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే ఆర్థిక నేరాల విభాగం అధికారులు నోరా ఫతేహీని సుదీర్ఘంగా ప్రశ్నించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. తనకు సుకేశ్‌తో నేరుగా పరిచయం లేదని, అతని భార్య లీనా మరియా పాల్ ద్వారానే మాట్లాడానని నోరా అధికారులకు తెలిపారు. 2020 డిసెంబర్‌లో చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కేవలం వృత్తిపరంగానే హాజరయ్యానని ఆమె వివరించారు.