తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పారు. గతంలో ఆయనపై చేసిన వ్యక్తిగత, నిరాధారమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఈ పరిణామంతో ఆమె తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

అప్పట్లో ప్రతిపక్షంపై చేసిన రాజకీయ విమర్శల్లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ ఉద్దేశపూర్వకంగా కించపరిచే ఉద్దేశం తనకు లేదని సురేఖ తన పోస్టులో స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించిన కొన్ని రోజులకే ఈ పరిణామం జరగడం గమనార్హం. సరైన వివరణ ఇవ్వకుండా తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ మహిళను కావడం వల్లే తనను తప్పించారా అని కూడా ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో కొండా సురేఖ, ఆమె భర్త మురళి కాంగ్రెస్‌ను వీడి తిరిగి సొంత గూటికి (బీఆర్ఎస్) చేరవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్‌తో ఉన్న పాత విభేదాలను పరిష్కరించుకుని, పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోవడంలో భాగంగానే ఈ క్షమాపణ చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ పరిణామంపై బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.