తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిశోర్‌ను గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం పునర్నియమించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దాన కిశోర్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన సేవలను పదవీ విరమణ అనంతరం కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు జీఏడీ జీఓ ఆర్టీ నంబర్ 1554ను విడుదల చేసింది.

ప్రస్తుతం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న దాన కిశోర్‌ను అదే పదవిలో పునర్నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.