హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఓ కేసులో సహాయం చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్, ఓ ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, బుధవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐ విజయ్‌ను పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడంతో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వెంటనే ఎస్ఐ విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.