రాజస్థాన్‌తో ఒప్పందం రద్దు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
Advertisement

రాజస్థాన్‌తో ఒప్పందం రద్దు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

Harish Rao writes to CM Revanth Reddy to cancel power agreement with Rajasthan
  • రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్ కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం
  • తెలంగాణ వనరులతో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వడమేంటని ప్రశ్న
  • రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి నుంచి రాజస్థాన్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగ నిర్వహణలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా ఉత్పత్తి అయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు చెందిన సంస్థకు కేటాయించడంపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సింగరేణి గనుల నుంచి, నీరు గోదావరి నది నుంచి సేకరిస్తున్నారని, అలాగే భూమి కూడా తెలంగాణదేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వనరులతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను మన అవసరాలకు వినియోగించకుండా వేరే రాష్ట్రానికి కేటాయించడంపై నిలదీశారు.

తెలంగాణలో విద్యుత్ కోతలతో రైతుల పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికి సిద్ధపడటం దారుణమని హరీశ్ రావు అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు కనీసం 7-8 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని తన లేఖలో స్పష్టం చేశారు.
Advertisement
Harish Rao
Revanth Reddy
Singareni Thermal Power Plant
Telangana Power Supply
Rajasthan Electricity Agreement
Telangana Politics

More Telugu News