కేసీఆర్ కట్టినవాటికి రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తున్నారు: కౌశిక్ రెడ్డి
Advertisement

కేసీఆర్ కట్టినవాటికి రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తున్నారు: కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy says Revanth is cutting ribbons for projects built by KCR
  • రేవంత్ రెడ్డి ఒక రిబ్బన్ కటింగ్ సీఎం అని పాడి కౌశిక్ రెడ్డి విమర్శ
  • సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో 10 శాతం కొడంగల్‌లో చేయాలని సవాల్
  • రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఒక 'రిబ్బన్ కటింగ్ సీఎం' అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్మించిన కట్టడాలకే రేవంత్ రెడ్డి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని ఆరోపించారు.

"కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్, ఇప్పుడు ఆయన కట్టిన వాటినే ప్రారంభిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా?" అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు ప్రజల నుంచి స్పందన లేదని అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన ఓ సవాల్ విసిరారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతం అయినా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో చేసి చూపించాలని అన్నారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే కరెంట్ సరఫరా సరిగా లేదని ఎద్దేవా చేశారు.

"తెలంగాణలో కాంగ్రెస్ తల్లిని నిలబెట్టారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు. అప్పుడు కాంగ్రెస్ తల్లిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపుతాం" అని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Padi Kaushik Reddy
Revanth Reddy
KCR
Telangana Politics
BRS Party
Sircilla Development

More Telugu News