బుల్లెట్ ట్రైన్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
Advertisement

బుల్లెట్ ట్రైన్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

KTR questions land acquisition for Bullet Train project in Bahadurpally
  • బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న కేటీఆర్
  • బహదూర్‌పల్లి రైతుల వ్యవసాయ భూములను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి
  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రభుత్వ భూమి ఉండగా రైతుల భూములు ఎందుకని ప్రశ్న
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ అభివృద్ధికి గానీ, బుల్లెట్ ట్రైన్‌కు గానీ వ్యతిరేకం కాదని, కానీ దాని ముసుగులో రైతుల భూములను లాక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

శంషాబాద్ విమానాశ్రయం వద్ద వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న బహదూర్‌పల్లి వ్యవసాయ భూములను ఎందుకు సేకరిస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక రైల్వే స్టేషన్ కోసం వెయ్యి ఎకరాలు అవసరమా? అని నిలదీశారు. రైతుల భూములపై సుమారు 4,000 మంది పోలీసులను మోహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "ప్రభుత్వం వద్ద సరైన పత్రాలు ఉంటే వాటిని రైతులకు చూపించాలి, అంతేకానీ పోలీసులను పెట్టి భయపెట్టడం ఎందుకు?" అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

"ఏడాదిన్నరలో మీ ఆశీస్సులతో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు. మీ పట్టాలు మీకే ఇప్పిస్తాం. మీకోసం హైకోర్టుకు వెళ్లిన కార్తీక్ రెడ్డి ద్వారానే మీకు పట్టాలు అందేలా చూస్తాం," అని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, ఐక్యంగా ఉండాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా, న్యాయపరంగా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
KTR
Telangana Congress government
Bullet Train land acquisition
Bahadurpally farmers protest
Revanth Reddy real estate scam
BRS party Telangana news

More Telugu News