అప్పుడే వ్యాపారం బాగుండేద‌ట‌.. తన రోజువారీ సంపాదన ఎంతో చెప్పిన కుమారి ఆంటీ

అప్పుడే వ్యాపారం బాగుండేద‌ట‌.. తన రోజువారీ సంపాదన ఎంతో చెప్పిన కుమారి ఆంటీ

Kumari Auntie reveals her daily earnings and says business was better before fame
  • రోజుకు 20 వేల సంపాదన.. ఖర్చులూ అంతేనన్న‌ కుమారి ఆంటీ
  • వైరల్ అవ్వకముందే రోజుకు 1500 మంది వచ్చేవారని వ్యాఖ్య 
  • ప్రస్తుతం 7 సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడి 
  • సీఎం రేవంత్ రెడ్డి తన దృష్టిలో దేవుడంటూ భావోద్వేగం
  • ఈసారి బిగ్ బాస్ అవకాశం వస్తే వదులుకోనని  స్పష్టీకరణ 
'మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా' అనే ఒక్క మాటతో సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన హైదరాబాదుకు చెందిన కుమారి ఆంటీ, ఇటీవల తన వ్యాపారం, సంపాదన, వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సోషల్ మీడియాలో వైరల్ కాకముందే తన వ్యాపారం ఇంకా ఎక్కువగా జరిగేదని ఆమె చెప్పడం గమనార్హం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.

గతంలో తన హోటల్‌కు రోజుకు 1500 మంది వరకు వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 1000కి తగ్గిందని కుమారి ఆంటీ తెలిపారు. క్రౌడ్ పెరిగిందనే వార్తలతో సాధారణ కస్టమర్లు రావడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రోజుకు రూ.20 వేల వరకు కౌంటర్ వసూలవుతున్నప్పటికీ, పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయని వివరించారు. 

"గతంలో కేజీ చికెన్ రూ.140 ఉంటే, ఇప్పుడు రూ.300 అయింది. బియ్యం బస్తా కూడా రూ.1000 నుంచి రూ.1800కి పెరిగింది. దీంతో ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటున్నాయి" అని ఆమె పేర్కొన్నారు.

హైదరాబాద్ రాకముందు తన సొంత గ్రామంలో రోజుకు రూ.50 కూలీకి పొలం పనులకు వెళ్లానని, ఏదైనా సాధించాలనే తపనతో 2011లో హైదరాబాద్ వచ్చి ఈ హోటల్ ప్రారంభించానని తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. తన హోటల్‌ను తొలగించాలని చూసిన క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకున్నారని, ఆయన తన దృష్టిలో దేవుడని, మనసున్న మారాజు అని కుమారి ఆంటీ భావోద్వేగంగా చెప్పారు.

ప్రస్తుతం తన అభిమానుల కోసం 7 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదని, ఈసారి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని కుమారి ఆంటీ స్పష్టం చేశారు.
Advertisement
Kumari Auntie
Hyderabad street food
Kumari Auntie daily income
CM Revanth Reddy
Kumari Auntie movie debut
Social media viral star

More Telugu News