ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్స్‌ వస్తున్నాయా? అయితే, శరీరం ఇస్తున్న సంకేతాలు ఇవే..!

ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్స్‌ వస్తున్నాయా? అయితే, శరీరం ఇస్తున్న సంకేతాలు ఇవే..!

Food Cravings and Body Signals You Should Know
  • తరచూ క్రేవింగ్స్‌ రావడం సాధారణ విషయం కాదంటున్న నిపుణులు
  • స్వీట్‌ తినాలనే కోరిక తరచూ కలిగితే భోజనంలో ప్రొటీన్‌ పెంచాలని సూచన
  • ఉప్పగా ఏదైనా కావాలనిపిస్తే శరీంలో ఎలక్ట్రోలైట్స్‌ తగ్గాయని అర్థమని వివరణ
  • ఐస్‌, సుద్ద, మట్టి లాంటివి తినాలనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాల్సిందేనన్న నిపుణులు
  • క్రేవింగ్స్‌ రాగానే మైండ్‌ను డైవర్ట్‌ చేసే పనులు చేయాలని సూచన
రోజంతా బాగానే ఉంటుంది. కానీ సాయంత్రం కాగానే ఓ స్వీట్‌ తినాలనిపిస్తుంది. బాగా అలసిపోయిన రోజు చిప్స్‌ గుర్తొస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత ఉప్పగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఒక్కోసారి ఐస్‌ ముక్కలు, సుద్ద లేదా మట్టి తినాలన్న కోరిక కూడా కలగొచ్చు. ఇవన్నీ కేవలం నాలుక రుచి కోరుకోవడమేనా? కొన్ని సందర్భాల్లో కాదు అంటున్నారు పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్‌. మన శరీరం, మనసులో జరుగుతున్న కొన్ని మార్పులు కూడా ఇలాంటి క్రేవింగ్స్‌కు కారణం కావచ్చని చెబుతున్నారు.

స్వీట్‌ కావాలనిపిస్తోందా?
భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగి, త్వరగా తగ్గితే తీపి తినాలన్న కోరిక రావచ్చని నమామి చెబుతున్నారు. అలాంటప్పుడు కేవలం స్వీట్‌ తినడం కాకుండా.. భోజనంలో ప్రొటీన్‌, ఫైబర్‌ ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి.

ఉప్పగా ఏదైనా తినాలనిపిస్తే..
ఎండలో ఎక్కువసేపు ఉండటం, వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్‌ తగ్గొచ్చు. ఈ సమయంలో ఉప్పగా ఉండే పదార్థాలు తినాలన్న కోరిక కలగవచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ కొంత భర్తీ చేసుకోవచ్చని నిపుణురాలు చెబుతున్నారు.

ఐస్‌, సుద్ద తినాలనిపిస్తే..
ఇది మాత్రం కాస్త భిన్నమైన విషయం. ఐస్‌, సుద్ద, మట్టి వంటి తినకూడని పదార్థాలను తినాలన్న కోరిక పదేపదే వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి పరిస్థితిని ‘పైకా’ అంటారు. కారణం తెలుసుకునేందుకు వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం కావచ్చు.

క్రేవింగ్స్‌ తగ్గాలంటే..
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది తెలియకుండానే ఇష్టమైన ఆహారం వైపు మొగ్గుచూపుతారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. దాహాన్ని ఆకలిగా భావించకుండా తగినంత నీరు తాగాలి. నిద్ర సరిగ్గా లేకపోయినా ఆకలి, తినాలన్న కోరికలు ప్రభావితమవుతాయి. రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండకపోవడం కూడా ఉపయోగపడతాయి.

చిప్స్‌ లేదా స్వీట్‌ తినాలన్న కోరిక వచ్చిన వెంటనే వాటివైపు వెళ్లకుండా కాసేపు నడవడం, రొటీన్‌ను మార్చుకోవడం, కొందరికి గమ్‌ నమలడం కూడా దృష్టిని మళ్లించవచ్చు. అయితే తరచూ వస్తున్న అసాధారణ క్రేవింగ్స్‌ను మాత్రం తేలిగ్గా తీసుకోకపోవడం మంచిది.
Advertisement
Food Cravings
Namami Agarwal
Nutritional Deficiencies
Pica Disorder
Healthy Diet Tips
Electrolyte Imbalance

More Telugu News