ఏపీ లిక్కర్ స్కామ్.. సిట్, ఈడీ అధికారులతో ఐటీ అధికారుల కీలక సమావేశం!
- ఏపీ లిక్కర్ స్కామ్ లో రంగంలోకి దిగిన ఐటీ శాఖ
- విదేశాలకు, బినామీ కంపెనీలకు నగదు మళ్లించినట్టు ఇప్పటికే గుర్తించిన దర్యాప్తు అధికారులు
- చట్టపరమైన చర్యలు, దాడులకు సిద్ధమవుతున్న ఐటీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో అక్రమంగా కొల్లగొట్టిన నిధుల మూలాలు, వాటి మళ్లింపుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మనీ ట్రయల్‌కు సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు హైదరాబాద్ వేదికగా సిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులతో ఐటీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
షెల్ కంపెనీలను సృష్టించి కోట్లాది రూపాయల నగదును విదేశాలకు మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు ఇదివరకే గుర్తించారు. ముఖ్యంగా దుబాయ్ సహా పలు ఇతర దేశాలకు, బినామీ కంపెనీలకు ఈ సొత్తును తరలించినట్లు తేలడంతో... ఆయా కంపెనీల నెట్‌వర్క్, వాటి వెనుక ఉన్న అసలు సూత్రధారులపై ఐటీ దృష్టి సారించింది. అసలు, నిధులు ఏ ఏ ఖాతాల గుండా ఎక్కడికి చేరాయి, విదేశీ ఖాతాలకు, బినామీ సంస్థలకు సొమ్మును ఏ రూపంలో తరలించారనే అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు.
ఈ దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ప్రధాన నిందితులు, డొల్ల కంపెనీల జాబితా, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల వివరాలను ఐటీ అధికారులు తీసుకున్నారు. ఈ కుంభకోణంతో పరోక్షంగా ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలకు సహకరించిన శక్తుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. సిట్, ఈడీ అందించిన ఆధారాలు, నివేదికల ఆధారంగా త్వరలోనే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు, దాడులకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.