పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు.. బీఆర్ఎస్ ఫైర్

Padi Kaushik Reddy Ethics Committee notices issued BRS fires back
  • కడియం శ్రీహరిపై వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి నోటీసులు
  • కౌశిక్ రెడ్డిని రాజకీయంగా బలి చేసేందుకు కుట్ర జరుగుతోందన్న వేముల ప్రశాంత్ రెడ్డి
  • సీఎం, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రావా? అని ప్రశ్న

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు ఈ నెల 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది.


అయితే, ఈ నోటీసులపై బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎథిక్స్ కమిటీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని... కౌశిక్ రెడ్డిని రాజకీయంగా బలిచేసేందుకే ఈ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు.


శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్, మందుల సామేల్, వీర్నపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో మాట్లాడిన తీవ్రమైన పదజాలం, అసభ్య సైగల వీడియోలను ఈ సందర్భంగా వేముల ప్రదర్శించారు. సభలో సీఎం, అధికార పక్ష నాయకులు చేసిన బెదిరింపులు, వ్యాఖ్యలు ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రావా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.


అంతేకాకుండా, కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని స్పీకర్ సిఫార్సు చేసిన సమయంలో అసలు ఎథిక్స్ కమిటీయే మనుగడలో లేదని, అలాంటప్పుడు ఆ అంశాన్ని కమిటీకి ఎలా రెఫర్ చేస్తారని వేముల నిలదీశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొంది ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేస్తున్న కడియం శ్రీహరి వైఖరిని మాత్రమే కౌశిక్ రెడ్డి ఆక్షేపించారని, దీనిపై కక్షపూరితంగా వ్యవహరించడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

Advertisement
Padi Kaushik Reddy
Telangana Ethics Committee
BRS Party
Kadiyam Srihari
Vemula Prashanth Reddy
Revanth Reddy Government

More Telugu News