భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
- భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు
- శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూ లైన్లు
- నిన్న స్వామి వారిని దర్శించుకున్న 77,568 మంది భక్తులు
కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. తిరుమలేశుని దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోవడమే కాకుండా, క్యూలైన్ వెలుపల ఉన్న శిలాతోరణం వరకు బారులు తీరింది.
ఈ రద్దీ కారణంగా ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కలగడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు, నిన్న ఒక్కరోజే మొత్తం 77,568 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో 35,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు రాగా, భక్తులు రికార్డు స్థాయిలో 4.15 లక్షల లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం సులభంగా జరిగేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.