యూట్యూబ్‌కు పోటీగా ‘బిలిబిలి’.. 1,000 వ్యూస్‌కు రూ.60 వరకు చెల్లింపు?

Bilibili to compete with YouTube and pay 60 rupees for 1000 views
  • యూట్యూబ్‌కు పోటీగా బిలిబిలి అంతర్జాతీయ విస్తరణ
  • 1,000 వ్యూస్‌కు రూ.60 వరకు చెల్లింపుపై ప్రచారం
  • క్రియేటర్ల చెల్లింపులను ధ్రువీకరించని బిలిబిలి  
  • అంతర్జాతీయ వెర్షన్‌లో సులభమైన రిజిస్ట్రేషన్‌
  • బిలిబిలికి 35 కోట్లకు పైగా నెలవారీ యూజర్లు
యూట్యూబ్‌కు పోటీగా అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరించేందుకు చైనా వీడియో షేరింగ్‌ వేదిక ‘బిలిబిలి’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కంటెంట్‌ క్రియేటర్లకు భారీగా చెల్లింపులు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1,000 వ్యూస్‌కు 0.70 డాలర్లు అంటే దాదాపు రూ.60 వరకు చెల్లించే అవకాశం ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెల్లింపు వివరాలను ‘బిలిబిలి’ అధికారికంగా ధ్రువీకరించలేదు.

చైనాలో యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా గుర్తింపు తెచ్చుకున్న బిలిబిలి ఇప్పుడు పశ్చిమ దేశాల్లోకి అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ వెర్షన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. తప్పనిసరి గుర్తింపు ధ్రువీకరణ లేకుండానే ఖాతా తెరిచే అవకాశం కల్పించనుంది. విదేశీ వినియోగదారులకు అనుగుణంగా కొత్త ఫీచర్లు, స్థానికీకరించిన అనుభవాన్ని అందించనుంది.

బిలిబిలి చెల్లింపులపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. స్పానిష్‌ భాషా ఖాతా ‘ఎల్‌ డుయ్‌’ ఈ విషయాన్ని ‘ఎక్స్‌’లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లను ఆకర్షించేందుకు అంతర్జాతీయ మానిటైజేషన్‌ అవకాశాలను బిలిబిలి అందిస్తోందని పేర్కొంది. ఆ పోస్టుకు 16 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

2009లో ప్రారంభమైన బిలిబిలికి ప్రస్తుతం 35 కోట్లకు పైగా నెలవారీ యూజర్లు ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రియేటర్లు కూడా ఈ వేదికపై ఇప్పటికే తమ ఉనికిని చాటుతున్నారు. ప్రముఖ యూట్యూబర్‌ మిస్టర్‌బీస్ట్‌ 2024లో బిలిబిలిలో కంటెంట్‌ పెట్టడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనకు 88 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అయితే యూట్యూబ్‌తో పోలిస్తే బిలిబిలి ప్రకటనల వ్యవస్థ, క్రియేటర్‌ ఫండ్‌ ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కువ వ్యూస్‌ వచ్చినా అందరికీ భారీ ఆదాయం వస్తుందనే హామీ లేదని సూచిస్తున్నారు.
Advertisement
Bilibili
YouTube competitor
Content creator monetization
MrBeast
Video sharing platform
Social media news

More Telugu News