చాట్‌జీపీటీలో ఇక యాడ్స్‌.. ఈ యూజర్లకు మాత్రమే!

  • భారత్‌లో ఫ్రీ, గో యూజర్లకు చాట్‌జీపీటీ ప్రకటనలు
  • ‘గో’ ప్లాన్‌ నెలకు రూ.399
  • ప్లస్‌, ప్రో తదితర చెల్లింపు ప్లాన్లకు ప్రకటనలు ఉండవు
  • యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనదారులకు ఇవ్వబోమని ఓపెన్‌ఏఐ స్పష్టీకరణ
  • ఈ వారం 50కి పైగా బ్రాండ్ల ప్రకటనలు ప్రారంభం
చాట్‌జీపీటీ యూజర్లకు ఇకపై ప్రకటనలు కనిపించనున్నాయి. భారత్‌లో ‘చాట్‌జీపీటీ యాడ్స్‌’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ‘ఫ్రీ’, ‘గో’ ప్లాన్లలో ఉన్న లాగిన్‌ అయిన వయోజన యూజర్లకు ఈ ప్రకటనలు కనిపిస్తాయి. భారత్‌లో ‘గో’ ప్లాన్‌ నెలకు రూ.399గా ఉంది.

చాట్‌జీపీటీ సమాధానం దిగువ భాగంలో స్పాన్సర్డ్‌ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని స్పష్టంగా ‘యాడ్‌’గా గుర్తిస్తారు. చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాల నుంచి ప్రకటనలను ప్రత్యేకంగా చూపిస్తామని ఓపెన్‌ఏఐ తెలిపింది. ప్లస్‌, ప్రో, బిజినెస్‌, ఎంటర్‌ప్రైజ్‌, ఎడ్యుకేషన్‌ ప్లాన్లలో ఉన్న వారికి ప్రకటనలు ఉండవు.

యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. యూజర్ల చాట్స్‌, చాట్‌ హిస్టరీ, మెమరీస్‌, వ్యక్తిగత వివరాలను ప్రకటనదారులు చూడలేరని తెలిపింది. యూజర్ల డేటాను ప్రకటనదారులకు విక్రయించబోమని పేర్కొంది. ప్రకటనల పనితీరుకు సంబంధించిన మొత్తం గణాంకాలు మాత్రమే ప్రకటనదారులకు అందుతాయి. ఇందులో ప్రకటన ఎన్నిసార్లు కనిపించింది, ఎన్ని క్లిక్స్‌ వచ్చాయనే వివరాలు ఉంటాయి.

18 ఏళ్లలోపు వారిగా గుర్తించిన ఖాతాలకు ప్రకటనలు చూపించరు. ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రాజకీయాల వంటి సున్నితమైన లేదా నియంత్రిత అంశాలపై సమాధానాల పక్కన కూడా ప్రకటనలు కనిపించవు.

ఈ వారం భారత్‌లో 50కి పైగా బ్రాండ్లు చాట్‌జీపీటీలో ప్రకటనలు ప్రారంభించనున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. సెప్టెంబర్‌ 4 నుంచి భారత్‌లో చాట్‌జీపీటీ ‘యాడ్స్‌ మేనేజర్‌’ను స్వయంగా ఉపయోగించుకునే అవకాశం వ్యాపారాలకు కల్పించనుంది. రోజుకు కనీసం రూ.725 బడ్జెట్‌తో ప్రకటనల కోసం నమోదు చేసుకోవచ్చు.

ఈ నెల ప్రారంభంలో చాట్‌జీపీటీ వారానికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లను దాటింది. 2026 ఫిబ్రవరి నాటికి భారత్‌లో వారానికి 10 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సంస్థలు ఇందులో భాగంగా ఉన్నారు.

చాట్‌జీపీటీలో ప్రకటనల ప్రయోగాన్ని ఓపెన్‌ఏఐ తొలిసారి 2026 జనవరిలో ప్రకటించింది. ఫిబ్రవరిలో అమెరికాలో ప్రారంభమైన ఈ ప్రయోగం ఆరు వారాల్లోనే 10 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఆ తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, మెక్సికో, బ్రెజిల్‌, జపాన్‌, దక్షిణ కొరియాకు విస్తరించింది. గత వారం 31 యూరోపియన్‌ దేశాల్లోనూ చాట్‌జీపీటీ యాడ్స్‌ను ప్రారంభించింది.
Advertisement

More Telugu News