నా అప్పు కన్నా ఎక్కువే వసూలు చేశారు: సుభాష్ చంద్ర ఉదంతాన్ని ప్రస్తావించిన విజయ్ మాల్యా

Vijay Mallya claims banks recovered more than his debt citing Subhash Chandra case
  • తనకు న్యాయం జరగడం లేదంటూ మరోసారి వాపోయిన విజయ్ మాల్యా
  • అప్పు కంటే బ్యాంకులకు ఎక్కువే చెల్లించానని ఆరోపణ
  • సుభాష్ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్ట్
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన అసలు మొత్తం కంటే అధికంగానే రికవరీ చేశారని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆయన వాపోయారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన ఒక పోస్ట్ చేశారు.

మీడియా అధినేత సుభాష్ చంద్ర, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి, రూ. 22,006 కోట్ల రుణ క్లెయిమ్‌లను సెటిల్ చేసుకోబోతున్నారంటూ వచ్చిన ఒక మీడియా కథనాన్ని విజయ్ మాల్యా ప్రస్తావించారు. "ఇది నిజమైతే నా స్నేహితుడు సుభాష్‌కు అభినందనలు. నా నుంచి రూ. 6,203 కోట్ల అప్పునకు గాను రూ. 14,100 కోట్లు రికవరీ చేసినట్లు బ్యాంకులు, ప్రభుత్వం అంగీకరించాయి. భారత రుణ పరిష్కార న్యాయం అంటే ఇదేనేమో! మీడియా దీనిపై ఎందుకు ప్రశ్నించదు?" అని తన పోస్ట్‌లో నిలదీశారు.

గత ఏడాది డిసెంబర్‌లోనూ విజయ్ మాల్యా ఇవే తరహా ఆరోపణలు చేశారు. తన నుంచి రికవరీ చేసిన మొత్తంపై ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య లెక్కల్లో పొంతన లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పార్లమెంటులో రూ. 14,100 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొనగా, బ్యాంకులు మాత్రం రూ. 10,000 కోట్లు అంటున్నాయని, ఈ వ్యత్యాసపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రికవరీ లెక్కలను నిర్ధారించేందుకు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన కోరారు.

మరోవైపు ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 అక్టోబర్ 31 నాటికి దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించారు. వీరి వల్ల బ్యాంకులకు అసలు రూపంలో రూ. 26,645 కోట్లు, వడ్డీ రూపంలో రూ. 31,437 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వీరి నుంచి ఇప్పటివరకు రూ. 19,187 కోట్లు రికవరీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మాల్యా నుంచి అసలు మొత్తం రికవరీ అయినప్పటికీ, వడ్డీ, జరిమానాలతో పాటు ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Vijay Mallya
Subhash Chandra
Debt Recovery
Kingfisher Airlines
Insolvency and Bankruptcy Code
Fugitive Economic Offender

More Telugu News