హె-1బీ వీసాదారులకు అమెరికా మ‌రో షాక్?.. భారతీయ టెక్కీలకు కష్టకాలం!

Donald Trump administration may scrap 60-day grace period for H1B visa holders
  • అమెరికాలో 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ప్రతిపాదన
  • కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉండని వైనం
  • ఉద్యోగం కోల్పోయిన విదేశీయులపై తీవ్ర ప్రభావం
  • భారతీయ హెచ్‌-1బీ వీసాదారులకు పెరగనున్న ఇబ్బందులు
  • ప్రస్తుతం వైట్‌హౌస్‌లో సమీక్ష దశలో ఉన్న కొత్త నిబంధన
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నిపుణులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చేసిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) వద్ద సమీక్ష దశలో ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, ఉద్యోగం కోల్పోయినహెచ్‌-1బీ వీసాదారులు, ఇతర విదేశీ ఉద్యోగులు దాదాపు తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ మార్పు అమెరికాలోని భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఏమిటీ 60 రోజుల నిబంధన?
అమెరికాలో హెచ్‌-1బీ, ఎల్‌-1, ఓ-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు ఒకవేళ తమ ఉద్యోగాన్ని కోల్పోతే, మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకోవడానికి 60 రోజుల సమయం ఉంటుంది. 2017లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ గ్రేస్ పీరియడ్ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వారు కంగారు పడకుండా, చట్టబద్ధంగా దేశంలో ఉంటూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు వీలు కలుగుతోంది. ఈ వెసులుబాటు ఈ-1, ఈ-2, ఈ-3,హెచ్‌-1బీ, హెచ్‌-1బీ1, ఎల్‌-1, ఓ-1, టీఎన్‌ వీసాలపై పనిచేస్తున్న వారితో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకూ వర్తిస్తుంది.

భారతీయులపై తీవ్ర ప్రభావం
ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే, ఈ 60 రోజుల గడువు పూర్తిగా రద్దవుతుంది. దీంతో ఉద్యోగం పోయిన మరుక్షణమే వారి వీసా స్టేటస్ ముగిసిపోతుంది. ఫలితంగా వారు అమెరికాలో ఉంటూ మరో కంపెనీకి మారడం గానీ, వీసా మార్చుకోవడం గానీ దాదాపు అసాధ్యం అవుతుంది. అమెరికా ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి జోక్యం చేసుకుంటే తప్ప, వారు వెంటనే స్వదేశానికి తిరిగి రావలసి ఉంటుంది.

అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రయోజనం పొందుతున్న వారిలో భారతీయులే అధికం. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్‌-1బీ పిటిషన్లలో 71 శాతం భారతీయులవేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) గణాంకాలు చెబుతున్నాయి. యూఎస్ జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 5.2 మిలియన్ల మందికి పైగా భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధన అమల్లోకి వస్తే వేలాది భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన సమీక్ష దశలోనే ఉన్నప్పటికీ, దీనిపై భారతీయ వర్గాల్లో తీవ్ర ఆందోళ‌న‌ నెలకొంది.
Advertisement
Donald Trump
H-1B Visa
Indian Techies
US Immigration
Grace Period
White House

More Telugu News