కఠినంగా మారిన కెనడా.. వేలమంది భారతీయులను వెనక్కి పంపేసింది!

Canada turns strict and deports thousands of Indians
  • ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,323 మంది భారతీయులను బహిష్కరించిన కెనడా 
  • బహిష్కరణ జాబితాలో మెక్సికన్లను దాటి అగ్రస్థానానికి చేరిన భారతీయులు 
  • వలస నిబంధనల ఉల్లంఘన, వీసా మోసాలే ప్రధాన కారణం
  • మరో 7,669 మంది ఇండియ‌న్స్‌ బహిష్కరణ జాబితాలో ఉన్నారని అధికారిక డేటా వెల్లడి
కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే కెనడా ప్రభుత్వం ఏకంగా 3,323 మంది భారత పౌరులను దేశం నుంచి బహిష్కరించింది. ఈ సంఖ్య గత ఆరేళ్ల రికార్డులను మించిపోయేలా ఉండటం గమనార్హం. కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.

2025 ఏడాది మొత్తంలో 3,779 మంది భారతీయులను బహిష్కరించగా, ఈ ఏడాది కేవలం ఆరు నెలల్లోనే ఆ సంఖ్యలో దాదాపు 88 శాతానికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వలస నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలోనే ఈ బహిష్కరణలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ డేటా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకు కెనడా నుంచి బహిష్కరణకు గురైన వారి జాబితాలో మెక్సికన్లు అగ్రస్థానంలో ఉండేవారు. కానీ, ఈ ఏడాది భారతీయులు వారిని అధిగమించారు. తొలి అర్ధభాగంలో 3,323 మంది భారతీయులను బహిష్కరించగా, మెక్సికన్ల సంఖ్య 1,573గా ఉంది. గత ఐదేళ్లుగా బహిష్కరణల జాబితాలో మెక్సికో మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో కొనసాగాయి. చివరిసారిగా 2020లో 1,424 మందితో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.

వలస నిబంధనలను పాటించకపోవడం, వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడం, ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురవడం, వీసా మోసాలకు పాల్పడటం వంటి కారణాలతోనే కెనడా ప్రభుత్వం ఎక్కువగా బహిష్కరణ వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఏ డేటా ప్రకారం.. మరో 7,669 మంది భారతీయులు బహిష్కరణ ప్రక్రియ జాబితాలో ఉన్నారు. అంటే.. సమీప భవిష్యత్తులో వీరిని కూడా దేశం విడిచి వెళ్ల‌మని ఆదేశించే అవకాశం ఉంది.

బహిష్కరణ ఉత్తర్వులు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి. డిపార్చర్ ఆర్డర్ పొందిన వారు 30 రోజుల్లో స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలి. లేదంటే అది డిపోర్టేషన్ ఆర్డర్‌గా మారుతుంది. ఎక్స్‌క్లూజన్ ఆర్డర్ కింద ఒకటి నుంచి ఐదేళ్ల వరకు కెనడాలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు. ఇక, డిపోర్టేషన్ ఆర్డర్ వస్తే.. కెనడా ప్రభుత్వ ప్రత్యేక అనుమతి లభించనిదే శాశ్వతంగా దేశంలోకి అడుగుపెట్టలేరు. అమెరికాతో పోలిస్తే కెనడా నుంచి బహిష్కరణకు గురవుతున్న భారతీయుల సంఖ్య రెండున్నర రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.
Advertisement
Canada
Indian deportations
Canada Border Services Agency
Visa violations
Immigration rules
Indian students in Canada

More Telugu News