Advertisement

మూడు సంస్థలను హ్యాక్ చేసిన ఆంథ్రోపిక్ ఏఐ మోడల్... సంచలన ప్రకటన

Anthropic AI models hacked three companies sensational announcement
  • సైబర్ సెక్యూరిటీ టెస్టుల్లో మూడు సంస్థల సిస్టమ్స్‌లోకి క్లాడ్ ఏఐ చొరబాటు
  • పొరపాటున ఇంటర్నెట్ యాక్సెస్ లభించడంతో ఘటన జరిగిందన్న ఆంథ్రోపిక్
  • డమ్మీ కంపెనీ అనుకుని, నిజమైన సంస్థ డేటాబేస్‌ను యాక్సెస్ చేసిన ఏఐ
  • ఇది తమ వైఫల్యమేనని, బాధ్యత తీసుకుంటున్నామని ప్రకటించిన సంస్థ
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ 'ఆంథ్రోపిక్'కు చెందిన క్లాడ్ ఏఐ మోడళ్లు, మూడు వేర్వేరు సంస్థల ప్రొడక్షన్ సిస్టమ్స్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు గురువారం వెల్లడించింది. ఇటీవలే ఓపెన్‌ఏఐ సంస్థ సైతం తమ మోడళ్లు పరీక్షల సమయంలో కొన్ని సిస్టమ్స్‌లోకి ప్రవేశించినట్లు అంగీకరించిన నేపథ్యంలో, ఆంథ్రోపిక్ ఈ అంతర్గత సమీక్షను చేపట్టింది.

సైబర్ సెక్యూరిటీలో భాగంగా నిర్వహించిన 'క్యాప్చర్-ది-ఫ్లాగ్' టెస్టింగ్ సమయంలో ఈ తప్పిదం చోటుచేసుకుంది. సాధారణంగా ఈ టెస్టింగ్ ల కోసం వినియోగించే ఏఐ మోడళ్లు ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ఒక నియంత్రిత వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే, థర్డ్-పార్టీ భాగస్వామితో సమన్వయ లోపం కారణంగా ఆ మోడళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది. ఈ ఘటనలకు క్లాడ్ ఓపస్ 4.7, క్లాడ్ మైథోస్ 5తో పాటు మరో ఇంటర్నల్ రీసెర్చ్ మోడల్ కారణమని గుర్తించారు.

ఒక ప్రత్యేక సందర్భంలో, ఏఐకి సూచించిన కల్పిత సంస్థ పేరు అనుకోకుండా ఒక వాస్తవ కంపెనీ డొమైన్ పేరుతో సరిపోలింది. దీంతో ఆ ఏఐ మోడల్ సదరు వాస్తవ సంస్థపై దాడి చేసి, పాస్‌వర్డ్‌లను చేజిక్కించుకోవడమే కాకుండా వందలాది వరుసల డేటా ఉన్న ప్రొడక్షన్ డేటాబేస్‌ను యాక్సెస్ చేసింది. మరో ఘటనలో, ఒక రీసెర్చ్ మోడల్ వేలాది లక్ష్యాలను స్కాన్ చేసి ఒక సంస్థకు చెందిన అప్లికేషన్‌ను హ్యాక్ చేసింది.

ఈ చొరబాటు వల్ల ప్రభావితమైన మూడు సంస్థలతో పాటు తమ భాగస్వామికి జూలై 27న సమాచారం అందించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. విస్మయకరమైన విషయం ఏమిటంటే, సదరు సంస్థలలో రెండు కంపెనీలు తమ సిస్టమ్స్‌లోకి చొరబాటు జరిగిన విషయాన్ని ఆంథ్రోపిక్ చెప్పే వరకు గుర్తించలేకపోయాయి. ఈ ఘటనను తమ కార్యాచరణ వైఫల్యంగా అంగీకరించిన ఆంథ్రోపిక్, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేసే వరకు సైబర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అధునాతన ఏఐ సాంకేతికత వల్ల పొంచి ఉన్న ప్రమాదాలకు ఈ ఘటన అద్దం పడుతోందని, పరీక్షా వాతావరణంలో చిన్నపాటి లోపాలు కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Anthropic
Claude AI
AI Hacking Incident
Cybersecurity Evaluation
Artificial Intelligence Risks
Production System Breach

More Telugu News