Advertisement

సీదిరి అప్పలరాజుకు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

Seediri Appalaraju bail petition dismissed by court in road accident case
  • మాజీ మంత్రి అప్పలరాజుకు బెయిల్ నిరాకరణ
  • కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాల తారుమారు ఆరోపణలు
  • అనుచరుడితో తప్పుడు లొంగుబాటు నాటకం ఆడినట్లు అభియోగం
  • సీసీటీవీ ఫుటేజీతో బయటపడిన అసలు నిజం
  • ప్రస్తుతం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న అప్పలరాజు
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు కోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. సీదిరి అప్పలరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఆయన జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. జులై 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న బైక్, దానయ్య (45) అనే గొర్రెల కాపరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అప్పలరాజు తన కుమారుడిని అక్కడి నుంచి కారులో తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని కొడుకును రక్షించేందుకు, తన అనుచరుడైన సిద్ధార్థ్ అనే యువకుడితో తానే ప్రమాదం చేశానని పోలీసుల ముందు లొంగిపోయేలా నాటకం ఆడించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో ఆరవ్ వర్మ తన బైక్‌లో పెట్రోల్ నింపుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం, బాధితుడి కుటుంబంపై ఒత్తిడి తేవడం వంటి అభియోగాలతో ఈ కేసులో అప్పలరాజును మూడో నిందితుడిగా (A3) చేర్చారు. జులై 22న ఆయన్ను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో ఆయన జైల్లోనే కొనసాగనున్నారు.
Advertisement
Seediri Appalaraju
Srikakulam road accident case
Aarav Varma hit and run
YSRCP leader bail petition dismissed
Evidence tampering case Andhra Pradesh
Seediri Appalaraju arrest update

More Telugu News