వైసీపీ నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి కళ్లల్లో రక్తం చూపిస్తానని, ఈ ప్రాంతంలో ఎవరూ వారి బెదిరింపులకు, కేసులకు భయపడరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన కేసు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా, కోరంగి మండలం, బుచ్చంపేటలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠ టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవానికి అంగీకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ విషయంపై ఆగ్రహంతో ఆయనపై దాడి చేశారనే ఆరోపణలతో జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజా స్పందిస్తూ, పార్టీకి, కార్యకర్తలకు ద్రోహం చేస్తూ మణికంఠ తనకు సమాచారం ఇవ్వకుండా ఏకగ్రీవానికి ఒప్పుకున్నారని, అందుకే ఆవేశంలో అలా ప్రవర్తించానని అంగీకరించారు. జరిగిన తప్పును సరిదిద్దుకుంటానని తెలిపారు.

ఏకగ్రీవ ఎన్నికలకు ఎక్కడా అంగీకరించవద్దని తమ పార్టీ అధినేత జగన్ ఆరు నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాజా గుర్తు చేశారు. జగన్ మాట తమకు శిరోధార్యమని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపకుండా, సీటును వేలం వేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని సీటును వేలం ద్వారా టీడీపీకి దక్కనీయనని ఆయన స్పష్టం చేశారు.