బ్రిటన్‌కు చెందిన దంపతులను ఊహించని అదృష్టం వరించింది. తాము నివసిస్తున్న వందేళ్ల నాటి పురాతన నివాసంలో వారికి భారీ మొత్తంలో పాత కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. ఇంటి సెల్లార్‌లో ఉన్న ఒక పాత పెయింట్ డబ్బాలో ఈ నగదు దొరకడంతో ఆ దంపతులు విస్మయానికి గురయ్యారు. ఈ ఘటనను వారు వీడియో తీసి సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

లూయిసా, డాన్ అనే దంపతులు 1900లలో నిర్మించిన ఒక పాత ఇంట్లో నివసిస్తున్నారు. తమ ఇంటి సెల్లార్‌లోకి వెళ్లే మెట్ల కింద ఇటుకలతో మూసివేసిన ఒక ప్రదేశాన్ని పరిశీలిస్తుండగా, వారికి పురుగులతో నిండిన ఓ పాత పెయింట్ డబ్బా కనిపించింది. దాని నుంచి ఘాటైన వాసన వస్తుండటంతో, వారు కొన్ని నెలల పాటు దాన్ని పట్టించుకోలేదు. అయితే, ఇటీవల ఆ డబ్బాను తెరిచి చూడగా, అందులో 1970వ దశకానికి చెందిన పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటి విలువ 1,000 పౌండ్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షలు) ఉంటుందని వారు గుర్తించారు.

ఈ నగదు లభించిన సమయంలో లూయిసా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దొరికిన ఈ డబ్బు తమకు ఎంతో ఆసరాగా నిలిచిందని ఆమె తెలిపారు. "ఆ డబ్బాలో నగదు ఉంటుందని మేము అస్సలు ఊహించలేదు. ఈ డబ్బుతో కొన్ని బిల్లులు చెల్లించగలిగాము, పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశాము. దీనివల్ల మాపై ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గింది" అని లూయిసా పేర్కొన్నారు.