రోడ్డుపై వెళ్లే మహిళలను చూసి ఈలలు వేయడం, అసభ్య చేష్టలకు దిగడం లాంటి పనులు చేసే పోకిరీలకు పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ దిమ్మతిరిగే బుద్ధి చెప్పారు. సాధారణంగా వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు భయపడతారని అనుకుంటారు. కానీ ఈమె మాత్రం ఒక బాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్‌లో సదరు పోకిరీ కాలర్ పట్టుకుని, నడిరోడ్డుపై 400 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.  

సాధారణ దుస్తుల్లో ఉందని తక్కువ అంచనా వేశాడు!
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిధిలో గల బీటీ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. సదరు మహిళా కానిస్టేబుల్ అప్పుడు విధుల్లో లేరు. ఆమె సివిల్ దుస్తులలో తన స్కూటర్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూసి అసభ్యకరమైన సైగలు చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించాడు. తను వేధిస్తున్నది ఒక పోలీస్ అధికారిణి అనే విషయం తెలియక, ఆమె వారించినా వినకుండా తన వికృత చేష్టలను కొనసాగించాడు.

నడిరోడ్డుపై 400 మీటర్ల నడక.. జనం షాక్!
నిందితుడి ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఆ మహిళా కానిస్టేబుల్ వెనకడుగు వేయలేదు. స్కూటర్ పక్కన ఆపి, నేరుగా నిందితుడి వద్దకు వెళ్లి అతని కాలర్ పట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా, చుట్టుపక్కల వందలాది మంది చూస్తుండగానే అతని కాలర్ వదలకుండా దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న ఖర్దా పోలీస్ స్టేషన్‌కు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఒక మహిళా కానిస్టేబుల్ నిందితుడిని అంత ధైర్యంగా ఒంటరిగా పట్టుకుని లాక్కెళ్లడం చూసి చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు, వాహనదారులు అవాక్కయ్యారు.

నిందితుడు అరెస్ట్.. నెట్టింట ప్రశంసల జల్లు
స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత ఆ లేడీ కాప్ నిందితుడిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడిని ఒక ఆన్‌లైన్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఆకాశ్ ఘోష్‌గా పోలీసులు గుర్తించి, తక్షణమే కస్టడీలోకి తీసుకున్నారు. ఒంటరిగా, ఎలాంటి భయం లేకుండా నిందితుడిని పట్టుకుని స్టేషన్‌లో అప్పగించిన మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని సీనియర్ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.