న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం కల్పించేందుకు సంజూ శాంసన్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని భారత మాజీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ సూచించాడు. వైభవ్‌ను ఆడించాలనుకుంటే అభిషేక్‌ శర్మకు విశ్రాంతినివ్వాలని అభిప్రాయపడ్డాడు. సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ జట్టులో మార్పులు చేయవచ్చని పేర్కొన్నాడు.

క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ కార్తీక్‌ ఈ సూచన చేశాడు. ‘‘వైభవ్‌ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. అతడికి అవకాశం ఇవ్వాలంటే అభిషేక్‌కు విశ్రాంతి ఇవ్వాలి. వైభవ్‌ గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ సంజూనే ఎందుకు తప్పించాలి? అభిషేక్‌కు కూడా విశ్రాంతి ఇవ్వొచ్చు. ఇక్కడ కీలకమైన విషయం విశ్రాంతి మాత్రమే’’ అని కార్తీక్‌ అన్నాడు.

బౌలింగ్‌ విభాగంలోనూ మార్పులు చేయాలని కార్తీక్‌ సూచించాడు. అక్షర్‌ పటేల్‌ను కొనసాగిస్తూ అర్ష్‌దీప్‌ సింగ్‌కు విశ్రాంతినివ్వవచ్చని చెప్పాడు. అతడి స్థానంలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లకు అవకాశం కల్పించవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, పరిస్థితులను బట్టి అదనపు స్పిన్నర్‌ను పరీక్షించవచ్చని పేర్కొన్నాడు.

గాయంతో ఇషాన్‌ కిషన్‌ రెండు, మూడో టీ20లకు దూరం కావడంతో వైభవ్‌కు జట్టులో చోటు దక్కింది. మూడో మ్యాచ్‌లో 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కోలుకుని తిరిగి రావడంతో నాలుగో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కలేదు. ఐదో టీ20 నవంబర్‌ 1న హామిల్టన్‌లో జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 3-1తో ఆధిక్యంలో ఉంది.