భారత మహిళా క్రికెట్ చరిత్రలో శనివారం ఒక సువర్ణాధ్యాయం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, 1976 అక్టోబర్ 31న, భారత మహిళల జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్‌తో తమ మొట్టమొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ చారిత్రక మ్యాచ్‌లో భాగమైన మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ శుభాంగి కులకర్ణి, ఈ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఆనాటి జ్ఞాపకాలను 'బీసీసీఐ.టీవీ'తో పంచుకున్నారు.

"ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్‌లో మేమంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మాలో చాలామంది 17-18 ఏళ్ల వయసున్న కాలేజీ అమ్మాయిలమే. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నామన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది" అని శుభాంగి గుర్తుచేసుకున్నారు. కేవలం 17 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఆమె, ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 48 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు.

అయితే, ఆ ప్రయాణం పూలపాన్పు కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని ఆమె తెలిపారు. "అప్పట్లో క్రికెట్ ఆడటానికి ఇంట్లో అనుమతి తీసుకోవడమే పెద్ద సవాల్. గాయాలవుతాయని, ఎండలో ఆడితే నల్లబడిపోతామని తల్లిదండ్రులు భయపడేవారు. దేశవాళీ టోర్నీలకు సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని, కొన్నిసార్లు రిజర్వేషన్ లేని రైలు బోగీల్లో ప్రయాణించేవాళ్లం" అని ఆనాటి కష్టాలను వివరించారు.

మహిళా క్రికెట్ అసోసియేషన్ (డ‌బ్ల్యూసీఏఐ) కార్యదర్శిగా, 2006లో దానిని బీసీసీఐలో విలీనం చేయడంలో శుభాంగి కీలక పాత్ర పోషించారు. శరద్ పవార్ సహకారంతో జరిగిన ఈ విలీనమే మహిళా క్రికెట్ దశను మార్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

"ఆ విలీనం తర్వాతే అమ్మాయిలకు మెరుగైన సౌకర్యాలు అందడం మొదలైంది. నాటి మా కష్టాలతో పోలిస్తే, నేటి తరానికి బీసీసీఐ అద్భుతమైన వసతులు కల్పిస్తోంది. ఫైవ్-స్టార్ హోటళ్లలో బస, విమాన ప్రయాణాలు, టాప్-క్లాస్ గ్రౌండ్స్ చూస్తుంటే గర్వంగా ఉంది" అని ఆమె అన్నారు. 

ముఖ్యంగా సమాన మ్యాచ్ ఫీజులు, సెంట్రల్ కాంట్రాక్టులు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రాకతో క్రీడాకారుల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

గతేడాది భారత జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడం తమలాంటి మాజీ క్రీడాకారుల కల నెరవేరిన క్షణమని శుభాంగి ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే 2027లో తొలిసారిగా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం సరైన నిర్ణయమని, ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.