సాధారణంగా చిన్న పాము కనిపిస్తేనే మనం వంద అడుగుల దూరంలో పరుగెడతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన, 10 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఎదురుపడితే గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ, ఓ మహిళ మాత్రం ఆ భయంకరమైన పామును అవలీలగా పట్టుకుని, మెడలో స్కార్ఫ్‌లా చుట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింత ఘటన బీహార్‌లోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ఓ మహిళ ఒంటరిగా భారీ రాచనాగును పట్టుకుంది. ఎలాంటి భయం, జంకు లేకుండా ఆ పామును మెడలో వేసుకుని నిలబడింది. అత్యంత ప్రమాదకరమైన పాముతో ఆమె ప్రవర్తించిన తీరు చూసి స్థానికులు నివ్వెరపోయారు. పాము కాటు వేస్తుందన్న భయం కూడా లేకుండా, దాన్ని ఓ అలంకరణ వస్తువులా మెడకు చుట్టుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిన్న పాముకే భయపడే జనం ఉన్నచోట, ఇంత పెద్ద కింగ్ కోబ్రాను మెడలో వేసుకోవడం ఆమె ధైర్యానికి నిదర్శనమని కొందరు అంటుంటే, ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.