బిజినెస్‌ క్లాస్‌లో కూర్చుని ఏడ్చేశాడు.. కారణం తెలిస్తే మనసు కదలాల్సిందే

Ash Lamba cries in business class and the reason is heart touching
  • విమాన ప్రయాణంలో భావోద్వేగానికి గురైన భారత సంతతి యువ పారిశ్రామికవేత్త
  • బిజినెస్‌ క్లాస్‌లో కూర్చొని చిన్నప్పుడు కన్న కలలు గుర్తొచ్చాయని వెల్లడి
  • తన ప్రయాణాన్ని ఇన్‌స్టాలో వీడియోగా పంచుకున్న వ్యాపారవేత్త అష్‌ లాంబా
  • చిన్ననాటి అనుభవాలే జీవిత లక్ష్యాలుగా మారాయని వ్యాఖ్య
  • కలలు మారినా వాటిని సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ అలాగే ఉందన్న అష్‌
చిన్నప్పుడు దూరం నుంచి చూసిన బిజినెస్‌ క్లాస్‌లో ఒక రోజు తాను ప్రయాణించాలని కలలు కన్నాడు. అది నిజమైన క్షణంలో ఆనందాన్ని ఆపుకోలేక విమానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెనడాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అష్‌ లాంబా తన జీవితంలోని ఈ భావోద్వేగ క్షణాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో విమానం కిటికీ పక్కన బిజినెస్‌ క్లాస్‌లో కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. అదే వీడియోలో తన విదేశీ పర్యటనలు, విలాసవంతమైన కారు, ఇంటి దృశ్యాలను కూడా చూపించారు.

వాస్తవానికి విమానంలో ఓ సరదా వీడియో తీయాలని అనుకున్నానని, కానీ కెమెరా ఆన్‌ చేసిన వెంటనే ఎందుకో కన్నీళ్లు వచ్చాయని అష్‌ తెలిపారు. ఆ సమయంలోనే తన చిన్ననాటి కల నిజమైందనే విషయం గుర్తుకు వచ్చి భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.

చిన్నప్పుడు విమాన ప్రయాణాల్లో వాష్‌రూమ్‌కు వెళ్లే పేరుతో బిజినెస్‌ క్లాస్‌ వైపు వెళ్లి అక్కడి వాతావరణాన్ని చూడాలని ప్రయత్నించేవాడినని గుర్తుచేసుకున్నారు. అలాగే తనతో చదివిన ధనిక స్నేహితుల విదేశీ విహారయాత్రలు, ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్లు, విలాసవంతమైన జీవనశైలి తనపై బలమైన ప్రభావం చూపాయని తెలిపారు.

తన బాల్యం ఎంతో సంతోషంగా గడిచిందని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనకు మంచి జీవితాన్ని ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ ప్రపంచాన్ని చూడాలని, మరింత స్వేచ్ఛగా జీవించాలని, జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి ఎదగాలని చిన్నప్పటి నుంచే తనలో బలమైన కోరిక ఉండేదని వెల్లడించారు. అదే తన జీవిత లక్ష్యంగా మారిందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఒకప్పుడు తెర వెనుక నుంచి చూసిన అదే బిజినెస్‌ క్లాస్‌లో కూర్చోవడం, అప్పట్లో ఊహల్లో మాత్రమే ఉన్న దేశాలకు ప్రయాణించడం, కలల్లో చూసిన కారును నడపడం, అసాధ్యమని భావించిన ఇంట్లో నివసించడం తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదని చెప్పారు.

ఆ కన్నీళ్లు విమాన ప్రయాణం కోసం కాదని, ఒక మంచి భవిష్యత్తు గురించి కలలు కన్న చిన్న బాలుడిని గుర్తు చేసుకోవడం వల్లే వచ్చాయని అష్‌ లాంబా భావోద్వేగంగా వివరించారు. ‘‘కలలు మారి ఉండొచ్చు.. కానీ వాటిని సాధించాలనే ఆకలి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది’’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
Advertisement
Ash Lamba
Indian entrepreneur Canada
Business class viral video
Success story motivation
Childhood dreams fulfillment
Viral Instagram post

More Telugu News