హోటల్‌లో గది తీసుకున్న తర్వాత బెడ్‌ను గమనిస్తే ఒక విషయం దాదాపు అందరికీ కనిపిస్తుంది. తెల్లని బెడ్‌షీట్‌పై కాళ్లవైపు రంగురంగుల ఒక బట్టను పరచి ఉంచుతారు. చాలామంది దీన్ని గది అందంగా కనిపించడానికి మాత్రమే ఉంచుతారని భావిస్తారు. కానీ దీని వెనుక అందంతో పాటు మరికొన్ని ఉపయోగకరమైన కారణాలూ ఉన్నాయి. హోటల్‌ రంగానికి చెందిన నిపుణులు దీని అసలు ఉపయోగాలను వివరించారు.

రక్షణ కోసమే
బెడ్‌పై కాళ్లవైపు ఉంచే ఈ వస్త్రాన్ని ‘బెడ్‌ రన్నర్‌’ అంటారు. దీని ప్రధాన ఉద్దేశం బెడ్‌షీట్‌ను రక్షించడమే. గదిలోకి వచ్చిన తర్వాత చాలామంది తమ బ్యాగులు, కోట్లు, హ్యాండ్‌బ్యాగులు, కొన్ని సందర్భాల్లో చెప్పులు కూడా బెడ్‌పైనే ఉంచుతుంటారు. ఇవి నేరుగా తెల్లని బెడ్‌షీట్‌కు తగలకుండా ఈ క్లాత్‌ అడ్డుగా ఉంటుంది. దీంతో దుమ్ము, మురికి, మరకలు పడే అవకాశం తగ్గుతుంది.

తెల్లని బెడ్‌షీట్లు
చాలా హోటళ్లు తెల్లని బెడ్‌షీట్లనే ఉపయోగిస్తాయి. అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అన్న విషయం సులభంగా గుర్తించవచ్చు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే తెల్లని గుడ్డలపై చిన్న మరక కూడా వెంటనే కనిపిస్తుంది. అందుకే ఎక్కువగా మురికి పడే భాగంలో బెడ్‌ రన్నర్‌ను ఉంచి బెడ్‌షీట్‌ను కాపాడుతుంటారు.

అతిథుల అలవాట్లు
చాలామంది బెడ్‌ అంచున కూర్చొని చెప్పులు వేసుకోవడం లేదా తీసేయడం చేస్తుంటారు. కొందరు సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లను కూడా బెడ్‌పైనే పెడతారు. అలాంటి సమయంలో మురికి నేరుగా బెడ్‌షీట్‌కు తగలకుండా బెడ్‌ రన్నర్‌ అడ్డుగా పనిచేస్తుంది. దీంతో బెడ్‌ ఎక్కువసేపు శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.

అందం కూడా
బెడ్‌ రన్నర్‌ కేవలం రక్షణ కోసమే కాదు. గదికి ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురావడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బెడ్‌షీట్‌కు భిన్నమైన రంగులో ఉండే ఈ వస్త్రం గది ఇంటీరియర్‌కు మరింత అందాన్ని జోడిస్తుంది. అందుకే చాలా హోటళ్లు తమ థీమ్‌కు తగ్గట్టుగా ప్రత్యేక రంగులు, డిజైన్లతో బెడ్‌ రన్నర్‌లను ఉపయోగిస్తుంటాయి.

ఒక జాగ్రత్త
అయితే పరిశుభ్రత పరంగా ఒక విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. బెడ్‌షీట్లు, దిండు కవర్లను ప్రతి అతిథి వెళ్లిన తర్వాత ఉతుకుతారు. కానీ బెడ్‌ రన్నర్‌లను మాత్రం ప్రతిసారీ ఉతకకపోవచ్చు. అందుకే వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేకపోతే గదిలోకి వెళ్లిన వెంటనే పక్కకు తీసి ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రతను మరింత మెరుగ్గా కాపాడుకోవచ్చు.