అంతర్జాతీయ ప్రయాణాలు మళ్లీ ఊపందుకుంటున్న తరుణంలో, సాహస యాత్రలు చేసే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ అయింది. ప్రపంచంలోని 10 అత్యంత ప్రమాదకరమైన పాముల వివరాలతో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఒక ప్రత్యేక ఫొటోస్టోరీని ప్రచురించింది. ఈ కథనం కేవలం పాముల విష తీవ్రతనే కాకుండా వాటి దూకుడు స్వభావం, మనుషులు నివసించే ప్రాంతాలకు సమీపంలో ఉండటం, అవి తరచుగా కాటు వేయడం వంటి అంశాలను కూడా ప్రమాదానికి కారణంగా పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది పాముకాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. ఒక పామును అత్యంత ప్రమాదకరమైనదిగా వర్గీకరించడానికి కేవలం దాని విషం మాత్రమే కాదని, అది కలిగించే వాస్తవ నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

భారత్‌లోనూ ముప్పు అధికం 
ఈ జాబితాలో ‘సా-స్కేల్డ్ వైపర్’ (ఒక రకం రక్తపింజర) అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు ప‌శ్చిమాసియా, ఆఫ్రికాలోనూ దీని కారణంగానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. రాత్రిపూట చురుగ్గా ఉండే ఈ పాము పొడి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, ఆసియా వ్యవసాయ క్షేత్రాల్లో తరచుగా కనిపించే ‘రస్సెల్స్ వైపర్’ (రక్తపింజర), ‘కామన్ క్రైట్’ (కట్లపాము), ‘ఇండియన్ కోబ్రా’ (నాగుపాము) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రస్సెల్స్ వైపర్ కాటు వల్ల శరీర కణజాలం, అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైనవి ఇవే.. 
భూమిపై అత్యంత విషపూరితమైన పాముగా పేరున్న ఆస్ట్రేలియాలోని ‘ఇన్‌లాండ్ తైపాన్’ను కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే, ఇది జనావాసాలకు చాలా దూరంగా ఉండటంతో దీనివల్ల ముప్పు తక్కువ. ఆఫ్రికా సవన్నాల్లో వేగంగా కదిలే ‘బ్లాక్ మాంబా’, ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం ‘కింగ్ కోబ్రా’, ‘పఫ్ యాడర్’, ‘డెత్ యాడర్’, అమెరికాలో కనిపించే ‘ఈస్టర్న్ డైమండ్‌బ్యాక్ రాటిల్‌స్నేక్’ వంటివి కూడా తమతమ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైనవిగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుమూల, ఉష్ణమండల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.