సినిమా సీన్‌ను తలపించిన ఘోర విమాన ప్రమాదం.. స్టార్టప్ సీఈవో దుర్మరణం!

Joshua Baer Capital Factory CEO dies in horrific Texas plane crash
  • టెక్సాస్‌లో హైవేపై కుప్పకూలిన ప్రైవేట్ జెట్
  • ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
  • మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడిన స్థానికులు
  • మృతుడు ఆస్టిన్ స్టార్టప్ సీఈవో జాషువా బేర్‌గా గుర్తింపు
  • సాంకేతిక లోపంతో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఘటన
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లారెడో నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం లూప్ 20 రహదారిపై పడిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి, ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. విమానం పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వారు చేసిన సాహసోపేత ప్రయత్నాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.

మెక్సికో నుంచి టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి వెళ్తుండగా సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంధనం అయిపోవడంతో విమాన సిబ్బంది లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే రన్‌వేకు కొద్ది దూరంలోనే విమానం నియంత్రణ కోల్పోయి రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలను, ఒక వాహనాన్ని ఢీకొట్టి రెండు ముక్కలైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆస్టిన్‌కు చెందిన 'క్యాపిటల్ ఫ్యాక్టరీ' స్టార్టప్ అధినేత జోషువా బేర్ అక్కడికక్కడే మరణించారు. విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక బ్యుటీషియన్ జైరా గార్జా, ఆమె భర్తతో పాటు మరికొందరు వాహనదారులు తమ కార్లను నిలిపివేసి విమానం వద్దకు పరుగులు తీశారు. లోపలి నుంచి అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని గమనించి, గొడ్డళ్లు, పారలు, సుత్తులతో విమానం ముఖభాగపు అద్దాలను పగలగొట్టి ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అత్యవసర రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే సామాన్య ప్రజలే రక్షకులుగా మారి వారి ప్రాణాలను కాపాడారు. దట్టమైన పొగ కారణంగా ఐదుగురు పోలీసు అధికారులు కూడా అస్వస్థతకు గురవగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
Go Back to Shorts
Joshua Baer
Capital Factory CEO
Laredo Texas plane crash
Private plane accident Texas
Joshua Baer death news
Texas highway plane crash

More Telugu News