జీవితంలో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ, ఒకప్పుడు ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసిన మహిళ ఇప్పుడు చైనాలోనే అత్యంత ధనిక వ్యక్తిగా అవతరించారు. పేదరికం నుంచి అపార సంపదను సృష్టించిన ఆమె పేరు ఝౌ క్యున్‌ఫెయ్ (56). గ్లాస్ తయారీ దిగ్గజం 'లెన్స్ టెక్నాలజీ' వ్యవస్థాపకురాలైన ఆమె, తన స్ఫూర్తిదాయక ప్రస్థానంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

అక్టోబర్ 28న విడుదలైన 'హురున్ రిచెస్ట్ ఉమెన్ ఇన్ చైనా 2026' జాబితా ప్రకారం.. ఝౌ క్యున్‌ఫెయ్ చైనాలో అత్యంత సంపన్న మహిళగా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15% పెరిగి 127 బిలియన్ యువాన్లకు (సుమారు రూ.1,80,692 కోట్లు) చేరింది. హన్‌సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు ఝోంగ్ హుయిజువాన్ (124 బిలియన్ యువాన్లు) రెండో స్థానంలో నిలిచారు. గతంలో 2015లో కూడా ఝౌ ఈ ఘనతను సాధించారు.

'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.. ఝౌ క్యున్‌ఫెయ్ జీవితం అనేక మలుపులతో సాగింది. 1970లో హునాన్‌లో జన్మించిన ఆమె, టీనేజి వయసులో చదువు మధ్యలో ఆపేసి షెన్‌జెన్‌కు వలస వెళ్లారు. అక్కడ ఒక వాచ్-గ్లాస్ ఫ్యాక్టరీలో రోజుకు కేవలం 1.20 డాలర్ల (సుమారు రూ.114) వేతనానికి పనిచేశారు. 23 ఏళ్ల వయసులో సొంతంగా ఒక గ్లాస్-ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. అక్కడే ఆధునిక తయారీ పద్ధతులను స్వయంగా నేర్చుకున్నారు.

ఆ తర్వాత ఆమె స్థాపించిన 'లెన్స్ టెక్నాలజీ'కి 2007లో లభించిన ఒక ఒప్పందం ఆమె తలరాతనే మార్చేసింది. యాపిల్ మొదటి తరం ఐఫోన్ల కోసం గ్లాస్ స్క్రీన్లను సరఫరా చేసే కాంట్రాక్టును లెన్స్ టెక్నాలజీ దక్కించుకుంది. అప్పటి నుంచి కంపెనీ వేగంగా అభివృద్ధి చెంది, స్మార్ట్‌ఫోన్ గ్లాస్ స్క్రీన్ల తయారీలో అగ్రగామిగా నిలిచింది. యాపిల్ వ్యాపారం ఆమెను ఒక సాధారణ ఫ్యాక్టరీ కార్మికురాలి స్థాయి నుంచి చైనాలోనే అత్యంత ధనిక మహిళగా మార్చింది.

హురున్ నివేదిక ప్రకారం.. చైనాలోని టాప్ 50 మంది సంపన్న మహిళల్లో 65% మంది స్వయంకృషితో ఎదిగినవారే కావడం విశేషం. వీరి అందరి సమష్టి సంపద రికార్డు స్థాయిలో 1.93 ట్రిలియన్ యువాన్లకు (సుమారు రూ.27.45 లక్షల కోట్లు) చేరింది.