జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ‘జెన్ జెడ్ రెగెల్ట్’ పేరుతో శనివారం రాత్రి జరిగిన ఆందోళనల్లో పలు నగరాల్లో ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు దుకాణాలను దోపిడీ చేయడంతో పాటు, పోలీసులపై మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌తో దాడులకు పాల్పడ్డారు.

విద్యా రంగంలో నిధుల కోత, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రజా సేవల క్షీణత, తప్పనిసరి సైనిక సేవ వంటి అంశాలపై యువత తమ గళాన్ని వినిపించారు. ఈ నిరసనలు బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌ సహా దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగాయి. వేలాది మంది యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

అయితే, ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనలు హింసారూపం దాల్చాయి. నగర కేంద్రంలోని రెండు దుకాణాలను ఆందోళనకారులు లూటీ చేశారు. అనేక దుకాణాల కిటికీలను పగలగొట్టారు. ఒక ఆయుధాల దుకాణంపై కూడా దాడికి యత్నించగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు, మోలోటోవ్ కాక్‌టెయిల్స్ విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జీల్ షాపింగ్ వీధిని మూసివేసి, నగర కేంద్రాన్ని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

హ్యాంబర్గ్‌లో ఆందోళనకారులు బారికేడ్లను తగులబెట్టగా, కొలోన్, బెర్లిన్‌ నగరాల్లో కూడా ఘర్షణలు నమోదయ్యాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడగా, అనేక మంది నిరసనకారులను అరెస్టు చేశారు.

"మేము శాంతి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. యుద్ధం, బలవంతం కోసం కాదు" అని నిరసన నిర్వాహకురాలు లినా ఫ్రెడ్రిక్ తెలిపారు. విద్య, ఆరోగ్య రంగాలకు మరిన్ని నిధులు కేటాయించాలని, తప్పనిసరి సైనిక సేవను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ హింసాత్మక ఘటనలు ఫ్రాన్స్‌లో జరిగిన అల్లర్లను గుర్తుచేస్తున్నాయని, తీవ్రవాద గ్రూపులు ఈ నిరసనలను వాడుకుంటున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, చాలా చోట్ల శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు సాయంత్రానికి హింసాత్మకంగా మారాయి.